Jun 04,2023 08:08

టాలీవుడ్‌లోనే కాదు.. ప్రతి పరిశ్రమలోనూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆద్యంతం అలరించేలా ఉండాలే కానీ.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జానర్లను ఇష్టపడే ఆడియెన్స్‌ ఎప్పుడూ ఉంటారు. పైగా దీనికంటూ ఓ సెక్షన్‌ ఆఫ్‌ ఆడియెన్స్‌ ఎప్పుడూ ఉంటారు. కథ, కథనాలు బాగుంటే అన్ని జానర్లను అన్నివర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే నూతన నటీనటులైన ప్రియాంక డెరు టైటిల్‌ రోల్‌లో థన్వీర్‌, సాయితేజ గంజి, శివ గంగా, ఆకాష్‌ లాల్‌, విశిష్ట నారాయణ, అభినవ్‌, శ్రేష్ట, గీతాసింగ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం 'హసీనా'. ఈ చిత్రం కథేంటి? ఎలా ఉంది? ప్రేక్షకులకు ఏ మేరకు చేరువైంది? తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే.. స్మగ్లింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ దందాలు చేస్తుంటాడు అభి (అభినవ్‌). అతనికి సీఐ అండ కూడా ఉంటుంది. అడ్డొచ్చిన వారిని హత్య చేసుకుంటూ వెళ్తాడు. అలాంటి అభికి ఓ సారి ఏసీపీతో గొడవ జరుగుతుంది. మరోవైపు ఐదుగురు అనాథలు హసీనా (ప్రియాంక డెరు), థన్వీర్‌ (థన్వీర్‌ ఎండీ), సాయి (సాయితేజ గంజి), శివ (శివ గంగా), ఆకాశ్‌ (ఆకాశ్‌ లాల్‌) చిన్నప్పటి నుంచి ఒకేచోట కలిసి పెరుగుతుంటారు. కలిసిమెలిసి ఉంటారు. అనాథలైనా కూడా అందరూ కష్టపడి చదువు పూర్తిచేసి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సంపాదిస్తారు. ఈ క్రమంలో హసీనా పుట్టినరోజు వస్తుంది. సెలబ్రేషన్స్‌ చేసేందుకు నిర్ణయించుకుంటారు. అయితే పుట్టినరోజున ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. ఆ చేదు ఘటనతో మిగతా నలుగురి జీవితాలు మలుపులు తిరుగుతాయి. వీరి కథలోకి అభి ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అభికి వీరితో ఉన్న లింక్‌ ఏంటి? హసీనాకు జరిగిన చేదు ఘటన ఏంటి? నలుగురు స్నేహితులు, హసీనాల ప్లాన్‌ ఏంటి? కథ ఎలా ముగిసింది? అనేదే మిగిలిన కథ...

2


సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి నవీన్‌ ఇరగాని దర్శకత్వం వహించారు. కథ విషయానికొస్తే చిన్నప్పట్నుంచి అనాథలు అయిన నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి స్నేహితులుగా కలిసి జీవిస్తారు. కలిసి చదవడం, ఉద్యోగాలు చేస్తుండటం.. వంటి సీన్లతో ప్రథమార్ధాన్ని అలా మెల్లిగా లాక్కొచ్చాడు దర్శకుడు. మధ్య మధ్యలో అభి పాత్రతో విలనిజాన్ని చూపిస్తూ వచ్చాడు డైరెక్టర్‌. ప్రథమార్ధం చివరకు ఓ ట్విస్ట్‌ను పెట్టారు. అది ఐదుగురు అనాథలు ఓ కేసులో చిక్కుకుంటారు. అసలు ఈ హత్యలు ఎవరు చేశారు? వీళ్ళే చేశారా? లేదా ఎవరైనా చేయించారా? అన్న ఉత్కంఠతో సాగుతుంది. దీంతోపాటు ప్రస్తుతం సైబర్‌ మోసాలు ఎలా జరుగుతున్నాయి.. అకౌంట్లోంచి డబ్బులు ఎలా మిస్‌ అవ్వడం.. ఫోన్లు హ్యాక్‌ చేయడం.. అనే అంశాల మీదా దృష్టి పెట్టాడు దర్శకుడు.
ఫస్ట్‌ హాఫ్‌ కొంచెం బోరింగ్‌గా సాగినా, ఇంటర్వెల్‌ నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో ఆసక్తిగా మారుతుంది. ఒకదాని తర్వాత ఒకటి రావడంతో ప్రేక్షకులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు. క్లైమాక్స్‌ మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది.
నటీనటులు కొత్తవారే అయినా బాగానే నటించారు. కామెడీ సీన్స్‌లో నవ్విస్తూ, యాక్షన్‌ సీన్స్‌లో ఫైట్స్‌ చేస్తూ, ఎమోషనల్‌ సీన్లలో కంటతడి పెట్టిస్తూ అందరూ పర్వాలేదనిపించారు. హసీనా పాత్రలో ప్రియాంక డెరు చాలా వేరియేషన్స్‌ చూపించారు. అభి పాత్రలో హీరోయిజం, విలనిజం చూపించాడు అభినవ్‌. ఇక థన్వీర్‌, సాయి, శివ, ఆకాష్‌, గీతాసింగ్‌ ఇలా అందరూ తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. సీఐ పాత్ర కూడా బాగానే ఆకట్టుకుంటుంది.
హసీనా సినిమా సాంకేతికంగా ఓకే అనిపిస్తుంది. షారుక్‌ షేక్‌ సంగీతం, నవనీత్‌ చారి బిజిఎం పర్వాలేదనిపిస్తాయి. అక్కడక్కడా మాటలు మెప్పిస్తాయి. రెండు గంటలే నిడివి పెట్టి ఎడిటర్‌ హరీష్‌ కృష్ణ (చంటి) ఈ సినిమాను బాగానే ఎడిట్‌ చేశాడు. రామ కందా సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది.

టైటిల్‌ : హసీనా
నటీనటులు : థన్వీర్‌, సాయితేజ గంజి,శివగంగా,ఆకాష్‌ లాల్‌, విశిష్ట నారాయణ,అభినవ్‌, శ్రేష్ట
దర్శకుడు : నవీన్‌ ఇరగాని
నిర్మాత : తన్వీర్‌ ఎండీ
ఎడిటర్‌ : హరీశ్‌ కృష్ణ(చంటి)
కెమెరామన్‌ : రామ కందా
సంగీత దర్శకుడు : షారుక్‌ షేక్‌
నేపథ్య సంగీతం : నవనీత్‌ చారి