విద్యార్థి మృతికి కారకుడైన గురుకుల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలి : ఎస్ఎఫ్ఐ
పెదబయలు (అల్లూరి) : విశాఖపట్నం మారికివలసకు చెందిన 5 వ తరగతి చదువుతున్న తెరవాడా చంద్రకిరణ్ (10) గిరిజన సంక్షేమ రెసిడెన్సియల్ బాలుర పాఠశాల విద్యార్థి మృతికి కారకుడైన ప్రిన్సిపల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా ఎస్ ఫ్ ఐ అల్లూరి జిల్లా అధ్యక్షులు జీవన కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జీవన కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ .... సెప్టెంబర్ 21 న చంద్రకిరణ్ కు రాత్రి నోటి నుండి ముక్కు నుండి రక్తం కారడం జరిగిందని, ప్రిన్సిపల్ తక్షణమే స్పందించకుండా మరుసటిరోజున కె జీ హెచ్ హాస్పిటల్ లో చేర్పించారని అప్పటికే విద్యార్థి పరిస్థితి చేజారిపోయి మృతిచెందాడని తెలిపారు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వహించడం వల్లే విద్యార్థి మృతి చెందాడని,ఉన్నత అధికారులు స్పందించి విద్యార్థి మృతికి కారకుడైన ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచకపోవడమే కాకుండా తల్లిదండ్రులకు కనీస సమాచారం అందించలేదని అన్నారు. విద్యార్థి పరిస్థితి విషమంగా మారిన తరువాత అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారని, ఇది దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని, తల్లిదండ్రుల కడుపుకోత తీర్చలేనిదన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మరణాల పట్ల ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ఈ ఏడాది సుమారు 20 మంది విద్యార్థులు వివిధ అనారోగ్యాలతో మృతిచెందారని, వరుసగా విద్యార్థులు మృతి చెందుతుంటే ప్రభుత్వజం కళ్ళకు గంతలు కట్టుకుందని ఆరోపించారు. విద్యార్థుల ప్రతి వసతి గృహంలో హెల్త్ అసిస్టెంట్ ఎఎన్‌ఎంను నియమించాలని, వసతిగృహల్లో మందులను నిల్వ ఉంచాలని కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించిన మరికవలస గిరిజన గురుకులం ప్రిన్సిపల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.










