- నేడు ప్రొఫెసర్ స్వామినాధన్ 98వ జన్మదినం
2023, ఆగస్టు 7 ప్రొఫెసర్ స్వామినాధన్ 98వవ పుట్టిన రోజు. రైతు కేంద్రంగా, కుటుంబ వ్యవసాయం నడవాలని తన ''జాతీయ రైతు కమిషన్'' వేదికల్లో పొందుపరచిన ఈ ప్రజా శాస్త్రవేత్తకు శుభాకాంక్షలు తెలుపుదాం. ఆహార భద్రతా చట్టం అమలులో, పౌరులకు పౌష్టికాహార లభ్యత విషయంలో భారతదేశం కూడా బాధ్యతగా ఉండాలని త్రికరణశుద్ధిగా కోరుకొనే ఈ శాస్త్రవేత్త ఆరోగ్యం బాగుండాలని కోరుకొందాం. ''ప్రొ.స్వామినాధన్ పరిశోధనా సంస్థ, చెన్నై'' వృద్ధి చెందాలని కాంక్షిద్దాం. వలసవాదుల హ్రస్వదృష్టి ప్రణాళికల ఫలితంగా భారతదేశం తిండిగింజల పరంగా 1950 వరకు దిగజారుతూ వచ్చింది. బెంగాల్ కరువుల వంటివి దేశ ఆహార రంగాన్ని పరాదీనంగా మార్చాయి. అందుకే ఆనాటి స్థితిని ''ఓడ నుండి నోటి వరకు'' గా వర్ణించారు. నాటి నెహ్రూ నాయకత్వ ప్రభుత్వం, ఏదైనా ఆగవచ్చు కాని ఆహార (వ్యవసాయ) రంగం ఆగకూడదనుకొంది. దానికి తగ్గ ప్రణాళికల్ని రూపొందించుకొంది. రెండు దశాబ్దాల్లో ఆహారపరంగా స్వయం సమృద్ధి గాడిలో పడటం మొదలయ్యింది. మరో దశాబ్ద ప్రణాళికల వల్ల తిండిగింజల ఉత్పత్తిలో దేశం నిలబడగలిగింది. అలీనోద్యమ వరవడికి చోదకశక్తిగా భారతదేశం రూపొందింది. దీని వెనుక ఆనాటి రాజకీయ నాయకత్వం - జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, సుబ్రమ్మణ్యం-రిచా రియా, రణదవా, యం.వి.రావు, గంగాప్రసాదరావు, ప్రధాన్, స్వామినాధన్ వంటి శాస్త్రవేత్తల సహకారంతో రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగాన్ని మార్చగలిగింది. దాన్నే విలియం గాడ్, నార్మన్ బోర్లాగ్ వంటి వారు ''హరిత విప్లవ'' మన్నారు. గోధుమ, వరి, మొక్కజొన్న, జొన్న వంటి ముఖ్య ఆహార పంటల ఉత్పత్తి దేశాన్ని మలుపు తిప్పింది. స్వామినాధన్‌కు ''ప్రపంచ ఆహార పురస్కారం'' (వరల్డ్ ఫుడ్ ప్రైజ్) వంటివి లభింపజేసింది. ఆహార రంగ వివిధ శాఖలు విస్తరించి, దేశ వ్యవసాయ పరిశోధనా రంగాల నిలయంగా మార్చబడ్డది. 21వ శతాబ్దం నాటికి 275 మి.ట. తిండిగింజల్ని ఉత్పత్తి చేయించగలిగింది. పంటల ఉత్పత్తుల పంపకంలో తగిన ప్రణాళిక ఆచరించబడలేదు. ఫలితంగా ''ఆహార భద్రత'' పౌరులందరికీవిస్తరించబడలేదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థ (యుఎన్‌డి) తన ఆహార వ్యవసాయ విభాగం (ఎఫ్.ఎ.ఒ) ద్వారా గుర్తుచేస్తూ వచ్చింది. స్వామినాధన్ వంటి వ్యవసాయరంగ నిపుణులు కూడా పదేపదే ప్రభుత్వం దృష్టికి తెస్తూనే ఉన్నారు. ''సహస్రాబ్ది (మిలీనియం) అభివృద్ధి లక్ష్యాల'' ప్రకటన ద్వారా భారతదేశం వంటి అభివృద్ధి చెందే దేశాలకు ''జీరో హంగర్'' (ఆకలిలేని దశ) గమ్యాన్ని సూచించారు. పార్లమెంట్ నామినేటెడ్ సభ్యుడిగా కూడా స్వామినాధన్ ప్రభుత్వానికి ఆ విషయం నివేదించారు. దాని ఫలితమే 2013లో భారతదేశ ''ఆహార భద్రతా చట్టం'' ఆచరణలోకొచ్చింది. ఉపాధి హామీ చట్టం ద్వారా ''ఆహారం'' హక్కుగా పరిగణించబడ్డది.
ప్రజా పంపిణీ వ్యవస్థ కీలకమైన ప్రభుత్వ నిర్వహణ బాధ్యతగా మార్చబడ్డది. పౌష్టికాహార లభ్యత పరంగా భారతదేశం యింకా వెనకబడే ఉందని గణాంకాలు సూచిస్తూనే ఉన్నాయి. దేశంలో తగినంతమంది (18 శాతం) యింకా ఆహారం అందని స్థాయిలో ఉన్నట్లు తేలింది. పౌష్టికాహార లభ్యత పరంగా యింకా ఎక్కువమంది ప్రతికూలతలోకి నెట్టబడ్డట్టు గుర్తించబడ్డది. కారణాలేమిటి? చర్చించబడాల్సిన అంశం.
ఆహార సంక్షోభ పరంగా ప్రపంచ నివేదిక-2022 ప్రకారం, దాదాపు 80 కోట్లమంది ప్రజలు ఆహార అందుబాటుకు దూరంగానే ఉన్నారు. ముఖ్యంగా ప్రపంచం ఎదుర్కొన్న ''కరోనా'' దాడి తరువాతి దశలో కూడా ఆకలికి గురౌతున్న జనాభా పెరుగుతూ వస్తున్నారని గణాంకాలు సూచిస్తూనే ఉన్నాయి. దానికి కారణం ప్రపంచాన్ని ఆవహించిన ఆర్థిక సంక్షోభం. ఫలితంగా అందకుండాపోతున్న ఆహార ధరలు, ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వాతావరణ సంక్షోభ వరవడి వంటివి ప్రభావితం చేస్తున్నాయి. వీటికి తోడు ఉక్రెయిన్ యుద్ధం, ఆకలి చావుల్ని పెంచింది. ఆహార కొరతను ఎదుర్కొంటున్న జనాభా గణాంకాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలు ప్రముఖంగా ఉన్నాయి. ఇందులో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉండటం గమనంలో ఉంచుకోవాలి.
ఆహార భద్రత నిర్వచనం ప్రకారం, ప్రజలందరికీ భౌతికంగా, ఆర్థికంగా తగినంత ప్రమాణంలో పౌష్టికాహార లభ్యత. అనగా పౌరుడు ఆరోగ్యకరంగా, విధి నిర్వహణ పరంగా ప్రయోజనం పొందాలి. ఆహార భద్రత చట్టం చేయబడ్డ భారతదేశంలో కూడా యిది సాధ్యపడలేదనే చెప్పుకోవాలి. సరైన ఆహార లభ్యత ఉన్న దేశంలో పిల్లల పెరుగుదల, స్త్రీల రక్తపుష్టి, పౌరులందరి మానసిక శారీరక దారుడ్యం సరిగ్గా ఉంటుందని కొన్ని ఐరోపా దేశాల గణాంకాలు సూచిస్తున్నాయి. భారతదేశం వంటి దేశాల్లో యింకా పిల్లల ఎదుగుదల సరిగ్గా లేక, స్త్రీల రక్తహీనత బయటపడుతూనే ఉన్నదని తేలింది. పౌష్టికాహార లోపాలు పెరిగి ఊబకాయ పౌరులు సంఖ్యాపరంగా పెరుగుతూ వస్తున్నారు. ఈ వరవడి 2030 నాటికి మన దేశ జనాభాలో పరిగణించదగినంత మంది ఆరోగ్య సమస్యల వలయంలో చిక్కుకుంటారని అర్థమౌతున్నది.
''జీరో హంగర్'' స్లోగన్‌తోనూ, ఆహార భద్రత చట్టంతోనూ పౌరుల్ని మభ్యపెట్టే ధోరణి విడనాడి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రజాపంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలి. ఆధునిక సాంకేతికాల సహకారంతో ''ఫుడ్ పోర్టిఫికేషన్'' (పౌష్టికాహార రూపకల్పన) చేసి అందరికీ అందుబాటులోకి తేవాలి. కేవలం ప్రకృతి వ్యవసాయం పర్యావరణ పరిరక్షణ అనే నినాదాలతో సమస్య పరిష్కారం కాదు. ఆవు ద్వారా లభించే ప్రయోజనాన్ని అతిగా పరిగణించి మిగిలిన పాడి, మాంస జంతువులను అలక్ష్యం చేసే పరిస్థితి ఉండకూడదు. వ్యవసాయ రంగ ఉద్ధరణలో మత్స్య, కోడి, గొర్రె పెంపకాల్ని విస్తరింపచేయాలి. వాటి ఉత్పత్తిదారులకు అనుకూల సహకారాన్ని అందించాలి. 2017-2021 భారతదేశ రైతు ఉద్యమాలు దేశ ఆహార భద్రతకు మేల్కొలుపుగా భావించి ఆహార ఉత్పత్తిదారుల, వినియోగదారుల మధ్య సమన్వయం కల్పించాలి. అప్పుడే ''ఆహార హక్కు'' చట్టానికి అర్థముంటుంది.
- ప్రొ.ఎన్.వేణుగోపాలరావు










