
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ : ఏలూరు రైల్వే స్టేషన్‌లో రూ.21.1 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో ఏలూరు రైల్వేస్టేషన్‌కు రూ.21.1 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చేపట్టబోయే ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసేందుకు గవర్నర్ ఏలూరుకు విచ్చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఢిల్లీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశాన్ని ఆయన వీక్షించారు. అనంతరం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్ ముఖ్య ప్రాంగణాలను అభివృద్ధి చేయడం, మెరుగైన పార్కింగ్, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, సాంస్కృతిక చిహ్నాలు, స్థానిక కళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి 'ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి' పథకం కింద స్టాల్ ఏర్పాటుకు స్థలం కేటాయించడం, ఎత్తయిన ఫ్లాట్ ఫారాల ఏర్పాటు, సాంకేతికంగా అభివృద్ధి చేయబడిన ప్రజా సమాచార వ్యవస్థ, స్పష్టమైన ఎల్‌ఇడి బోర్డుల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులను ఈ నిధులతో చేపట్టనున్నారు. కార్యక్రమంలో రైల్వే సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వి.రాంబాబు, డిఐజి జివిజి.అశోక్‌కుమార్, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, జడ్‌పి చైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.