Nov 02,2023 08:28

సహకార ఉద్యోగుల రిలే దీక్షల్లో ఎమ్మెల్సీ సాబ్జి
ముగిసిన మూడ్రోజుల రిలేదీక్షలు
ప్రజాశక్తి-గుంటూరు :అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మూడ్రోజులుగా ఉద్యోగులు దీక్షలు చేస్తున్నా అధికారులు స్పందించకపోవటం బాధాకరమని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి అన్నారు. గుంటూరు శ్యామలానగర్‌లోని సహకార శాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షల్లో భాగంగా బుధవారం చివరిరోజు దీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, సంఘ నాయకులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సహకార సంఘాల ప్రయివేటీకరణ, చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగానే విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, 2019 వేతన సవరణతోపాటు, ఆర్థిక ప్రయోజనాలు, గ్రాట్యుటీ చట్ట ప్రకారం చెల్లించాలని తదితర న్యాయమైన డిమాండ్లతో సహకార ఉద్యోగులు దీక్షలు చేపట్టారని తెలిపారు. ఈ దీక్షలకు పిడిఎఫ్‌ ఎమ్మెల్సీల తరపున సంపూర్ణ మద్దతు తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పి విజరుకుమార్‌, కిరణ్‌, వెంకటేశ్వరరావు, రామచంద్రరాజు, రామకృష్ణ, నాయక్‌, శివ, శ్రీను, సుబ్బారావు, చంద్రశేఖర్‌, శ్రీకాంత్‌రెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాస్‌, సీతారమ శర్మ దీక్షల్లో కూర్చున్నారు. యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి అజరుకుమార్‌, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి వెంకటరామయ్య, కె సత్యనారాయణ, కోశాధికారి పి సత్యనారాయణ ప్రసంగించారు.