ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి సీతారామరాజు జిల్లా):విద్యావ్యవస్థ, ఉపాధ్యాయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో శనివారం జరిగిన యుటిఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని, ఏటా డిఎస్‌సి ప్రకటిస్తామని, జనవరి నెలలో జాబ్ కేలండర్ విడుదల చేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. సుమారు ఏడు సంవత్సరాల నుంచి డిఎస్‌సి లేక కొన్ని ప్రాథమిక పాఠశాలలు ఒక్క టీచర్‌తోనే నడుస్తున్నాయని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల కొరత ఉందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాల్సిన ప్రభుత్వం నెలలో ఏదో ఒక రోజు చెల్లిస్తున్నాంలే అనే పరిస్థితికి వచ్చిందని ఎద్దేవాచేశారు. ప్రత్యేక హోదా విషయాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందన్నారు. దేశాన్ని అమ్మేయడానికి పార్లమెంట్‌లో మోడీ ప్రవేశపెట్టే బిల్లులన్నింటికీ వైసిపి ఎంపిలు బలపరుస్తుండడం సరికాదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, నాలుగున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడు పదివేల మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తామనడం సమంజసమా? అని ప్రశ్నించారు. సిపిఎస్ ఏడు రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చి జిపిఎస్ తెచ్చారని, దీన్ని ఏ ఉద్యోగి ఆమోదించారో చెప్పాలని అన్నారు.










