Jul 16,2023 09:45

అంబరాన్నంటిన సంబరం. ఆడపిల్లలంతా ఒకచోట చేరారు. ఒకరు చేతిలో గోరింట పెడుతుంటే.. మరొకరు ఇలా.. 'అరచేతిలో అందంగా / పాదానికి పారాణిగ / పెట్టినప్పుడు పచ్చంగ / పండెనంట ఎర్రంగ.. ఏమిటబ్బా అదీ! ఆహహా.. గోరింటా. అవునంటా!' అంటూ ఆనంద పరవశులవుతారు. పెళ్ళిళ్ళైనా.. పండుగలైనా.. నేనేనంటుంది ప్రతి ఇంటా మన గోరింట. అంతేనా.. పెళ్ళిళ్ళలో ఇదొక ప్రత్యేకమైన వేడుకగానూ జరుపుకుంటున్నారు. మన దేశంలో గోరింటాకుకు అంత ప్రాధాన్యత ఉంది మరి. రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే దీని మీద చాలా కథనాలు వినిపిస్తూంటాయి. అసలు ఈ గోరింటాకును ఐదువేల సంవత్సరాలకు ముందే ఈజిప్టులో గుర్తించారట. గోరింటాకును హిందీ, ఉర్దూలలో మెహందీ అని, ఇంగ్లీషులో హెన్నా అని పిలుస్తారు. మతాలకతీతంగా యూదులు, సిక్కులు, జైన్‌లు, క్రిస్టియన్‌లు అందరూ గోరింటాకును ఇష్టంగా పెట్టుకుంటారు. అలంకరణకే కాదండోరు! ఆరోగ్యదాయిని కూడా మన గోరింట. అయితే కలికాలంలో కల్తీ మోహించింది ఈ మెహిందీని కూడా. ఇంకా ఈ రుధిర మధురం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందామా..!

01

          ప్రకృతి పరంగా వచ్చే ప్రతి మార్పుకూ ప్రత్యేకత సంతరించుకున్నవే మన పండుగలు. వాతావరణ మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఆయా కాలాల్లో మన ఆహారం, ఆహార్యం నిర్ణయించారు పెద్దలు. నిశితంగా గమనిస్తే.. కాలాలు మారేటప్పుడు, పంటలు చేతికొచ్చే సమయాల్లో ఈ పండుగలు నిర్ణయించినట్లు అర్థమౌతుంది మనకు. దానిలో భాగంగానే అట్లతద్ది, ఆషాఢమాసాల్లో గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్ళు. ఇప్పటికీ గ్రామాల్లో, పట్టణాల్లో కొన్నిచోట్ల పాటిస్తున్నారు, చేతులు పండిస్తున్నారు కూడా. ఈద్‌ ఉల్‌ ఫితర్‌, ఈద్‌ ఉల్‌ అధా పండుగల సందర్భంలోనూ గోరింట ఆచారం ఉంది. ఆయా దేశాలలో వారి సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటాయట ఈ గోరింట అందాలు. ఇవన్నీ ఎందుకోసం అంటే.. ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నదే పెద్దల ఉద్దేశం.
 

                                                                         సర్వం ఆయుర్వేదం..

గోరింటాకు అందంగా కనిపించడమే కాదు.. అద్భుతమైన మూలిక కూడా అంటుంది ఆయుర్వేదం. గోరింట ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలేనట !
          ఒత్తిడి.. గోరింటాకు ఎక్కువగా పెళ్లిళ్లలో పెడుతుంటారు. పెళ్లి అంటే.. హడావుడి, ఆందోళన, రకరకాల భావోద్వేగాలతో కూడుకున్న పరిస్థితి. ఆ సమయంలో గోరింటాకు.. నరాలకు సాంత్వన అందించి.. శరీరానికి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుందట.
        గర్భాశయంలో.. గర్భాశయ దోషాలు తగ్గిస్తుంది. బాలింతలకు గోరింటాకు రసం ఇస్తే గర్భాశయ బాధలు నయమవుతాయిట. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుందని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
         గోళ్ళకు.. కాండిడా అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన గోరు పుచ్చినప్పుడు గోరింటాకు ముద్దని పెట్టుకుంటే ఇన్‌ఫెక్షన్‌ తగ్గి, మామూలు గోరు వస్తుంది. తరచుగా గోరింటాకు పెట్టుకుంటుంటే గోళ్లు పెళుసు బారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటుంది.
కాళ్ళు, కీళ్ళు.. అరికాళ్లు మండుతున్నట్లు అనిపిస్తే గోరింటాకు ముద్దను పెట్టుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయట.
 

                                                              పూలు, బెరడు, విత్తనాలు, వేళ్ళు..

గోరింట పువ్వులను మెత్తగా నూరి వెనిగర్‌లో కలిపి ఆ పేస్ట్‌ను నుదుటి మీద పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గిపోతుంది.
బెరడు జ్వరాన్ని, విత్తనాలు విరేచనాలను తగ్గిస్తాయి. బెరడు, ఆకులను నీటిలో నానబెట్టి, ఆ నీటిని తీసుకుంటే ప్లీహము, కాలేయము, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. అంటే ధమనులలో ఫలకం, ప్లేట్‌లెట్స్‌ నిరోధించి, గుండెపోటును నివారిస్తుందట.
గోరింటతో కలిపి కాచిన నూనెలను చిట్కా వైద్యంలో వాడుతుంటారు మన పెద్దలు. రక్తపోటును నియంత్రించి, హైపోటెన్సివ్‌ని అందిస్తుంది. సెగ్గెడ్డలు వచ్చి, ఎంతకూ పగలకుండా ఉన్నప్పుడు గోరింట పట్టు వేస్తే గడ్డలు పగిలి, చీము పోయి నొప్పి, పుండు త్వరగా తగ్గుతాయి.
బట్టతలకూ .. గోరింటాకులు ఆవనూనెలో వేసి మరిగించి, వెంట్రుకలు ఊడిన ప్రదేశంలో మసాజ్‌ చేస్తే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది.
విధానం : ఒక పాన్‌లో ఆవ నూనె 250 గ్రా., గోరింటాకు-50 గ్రాములు వేసి మరిగించాలి. ఈ నూనెను వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని, క్రమం తప్పకుండా జుట్టుకు రాసుకుంటుంటే వెంట్రుకలు పెరుగుతాయి.

77

                                                                                  హెన్నా ..

హెన్నా పెట్టుకునే విధానం తెలుసుకుందామా.. ఒక కాపర్‌ లేదా ఇనుప బౌల్‌లో గోరింటాకు పొడి, నిమ్మరసం మిక్స్‌ చేయాలి. పొడిజుట్టు అయితే కొన్ని చుక్కల ఆవ నూనె కలిపి, జుట్టుకు పట్టించాలి. జుట్టును సహజంగానే ఆరనివ్వాలి.
గోరింటాకు అంటే మహా ఇష్టమే. కానీ పెట్టుకోవడం రాకపోతే.. ఒకవేళ వచ్చినా రెండు చేతులకూ పెట్టుకోవడం సాధ్యం కాదు కదా. మరొకరి సాయం తీసుకోవాల్సిందే. ప్రతిసారీ అలా వీలు కాకపోవచ్చు. మరేం చేయాలి..? అందుకనే అన్నింటా సులువైన మార్గాలు, పరికరాలు వచ్చినట్టే గోరింటాకు పెట్టుకోడానికీ కొత్త సాధనాలు వచ్చాయి. వాటితో కోరిన డిజైన్‌ పెట్టుకోవచ్చు.
 

                                                                            హెన్నా స్టెన్సిల్స్‌..

మన చిన్నప్పుడు అరచేతి మధ్యలో బంతి ఆకుగానీ, చేమంతి ఆకుగానీ కదలకుండా ఉంచి, దానిపైన మెత్తని గోరింటాకు పెట్టుకునే వాళ్ళం. ఆరిన తర్వాత తీసి చూస్తే ఆకు అచ్చు అందంగా పడేది కదా! ఇదీ అలాంటిదే. నచ్చిన బొమ్మ ఆకారంతో ఉన్న స్టెన్సిల్‌ని చేతిలో అతికించుకొని, పైన గోరింటాకు పెట్టి ఆరిన తర్వాత తీసి చూస్తే.. అంతే అందమైన గోరింట చిత్రం కనువిందు చేస్తుంది.

55

                                                                       పోట్రెయిట్‌ మెహిందీ..

ఈ మధ్య కాలంలో పోట్రెయిట్‌ మెహిందీని బాగా ఇష్టపడుతున్నారు. అంటే రాధాకృష్ణులు, వధూవరులు, నెమలి, ఏనుగు ఇలా కష్టతరమైన బొమ్మలను సునాయాసంగా వేసుకోవచ్చు. అదెలాగంటే.. గాజు స్టాంప్స్‌ లాంటి బొమ్మల నమూనాలు వచ్చాయి. వాటిపై గోరింటాకు పెట్టుకుంటూ వెళ్ళిపోతే సరి. అందమైన కళాఖండం మన చేతిని అలంకరిస్తుంది.
 

                                                                             బాటిల్‌ హెన్నా పెన్‌..

ఇంకోరకం ఈ బాటిల్‌ హెన్నా పెన్‌. గోరింటాకును మెత్తగా నూరి, ఈ బాటిల్‌లోకి తీసుకొని మధ్యలో నొక్కుతూ పెన్‌లా పట్టుకొని చేతిమీద మనకు కావలసిన డిజైన్‌ వేసుకోవడమే. చూశారా అందమైన కళాఖండాలు మన చేతిలోనే.. అనొచ్చు !
 

                                                                          మరక మంచిదేనా..

గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఆరిపోయేంత వరకూ కాస్త అజాగ్రత్తగా ఉన్నామా.. అంతే తళతళలాడే బట్టలు మరకలు పడి నానా గందరగోళంగా అయిపోతాయి. మరక మంచిదే అని సరిపెట్టుకోలేం. మరి వాటి పరిస్థితి ఏమిటి అంటే..
హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, వెనిగర్‌లలో ఏదో ఒకటి ఆ మరక మీద అప్లై చేసి, కొద్దిసేపు నానిన తర్వాత బ్రష్‌ చేయాలి. ఎలాంటి సబ్బు/సర్ఫ్‌ పెట్టకుండా శుభ్రం చేయాలి. ఒకవేళ సబ్బుతో ఉతికితే దానిలోని కెమికల్‌ గోరింటాకులోని రసాయనాలతో కలిసి మరొక రంగులోకి మారిపోతుంది.
మరి గోరింట అందాలను ఆస్వాదిద్దామా..!!

44


                                                                             పంటకు కారణం..!

గోరింటాకు పెట్టుకున్నప్పుడు చేతులు, పాదాలు అంత ఎర్రగా పండటానికి కారణం ఏంటబ్బా అని చూస్తే.. గోరింటాకు శాస్త్రీయ నామం 'లాసోనియా ఇనార్మిస్‌'. దీనిలో లాసోన్‌ అనే సహజమైన రసాయనం ఉంటుంది. ఈ లాసోన్‌లో 2-హైడ్రాక్సీ-1,4-నాఫ్థోక్వినోన్‌ (83-72-7) అనే కారకాలుంటాయి. వీటి వల్లనే గోరింటాకు మన చేతులను ఎర్రగా పండిస్తుందట.
కృత్రిమ రసాయనాలు : అయితే ఇప్పుడు మనం వాడే మెహిందీ కోన్స్‌, హెన్నా పొడుల్లో ఇవే రసాయనాలను కృత్రిమంగా కలిపి, వ్యాపారం చేస్తున్నారు. ఇవి వాడినప్పుడు చేతులు పండటం తరవాతి సంగతి. అనేక అలెర్జీలు ఏర్పడుతున్నాయి. మాయని మచ్చలు మన సొంతమౌతున్నాయి. అందుకని ఎప్పుడూ అందుబాటులో ఉండే చెట్టు ఆకునే వాడుకుంటే ఉత్తమోత్తమం.

33

                                                                          తెల్లవెంట్రుకలకు..

చిన్నతనంలోనే తల వెంట్రుకలు తెల్లబడుతూంటే రకరకాల హెయిర్‌ డైలు రాయాల్సిన పనిలేదు. ఈ రోజుల్లో అయితే హెయిర్‌ డైలు ఉన్నాయి. కానీ పూర్వం ఇలాంటి వాటికి గోరింటాకే వాడేవారు.గోరింటాకును మెత్తగా నూరి ఒక ఇనుపమూకుడులో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తలకు పట్టించి తలస్నానం చేసేవారు. క్రమంగా జుట్టు రాగి వర్ణంలోంచి నలుపుకు తిరిగేది.

- టి. టాన్య
70958 58888