Jun 26,2022 10:47

విభిన్న తరహా చిత్రాలతో అలరించే హీరోల్లో సత్యదేవ్‌ ఒకరు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరవుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. హిట్స్‌, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ.. హీరోగా కన్నా నటుడిగా మంచి గుర్తింపు పొందారు. తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సామాజిక అంశాలు, వ్యవస్థల పనితీరు వంటి అంశాలతోపాటు, సందేశంతో మిళితమైన ఈ సినిమాతో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచారు? కథేంటి? చిత్రం ఏ మేరకు కనెక్ట్‌ అవుతుంది? అనే విషయాలు చూద్దాం.
కథలోకి వెళ్తే.. రాష్ట్ర మంత్రులు, ఒక ఎస్పీ, మరికొందరు హైప్రొఫైల్‌ పర్సనాలిటీలను కిడ్నాప్‌ చేస్తాడు 'గాడ్సే' అలియాస్‌ విశ్వనాథ్‌ రామచంద్ర (సత్యదేవ్‌). ఈ విషయం ప్రజలకు తెలిస్తే ఆందోళనకు గురవుతారని, ఇతర సమస్యలు ఏర్పడతాయని ప్రభుత్వం రహస్యంగా హ్యాండిల్‌ చేస్తుంది. ఈ కేసును వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఒక పోలీసు బృందాన్ని ఆదేశిస్తుంది. ఓ గర్భవతి మరణానికి కారణంగా రాజీనామా చేసిన వైశాలి (ఐశ్వర్యాలక్ష్మి) కి కేసును అప్పగిస్తారు. పెళ్లిచూపుల్ని సైతం పక్కనపెట్టి ఆపరేషన్‌లో పాల్గొంటుంది. ఈ క్రమంలో లండన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యాపారవేత్త విశ్వనాథ్‌ రామచంద్ర వీళ్లందరినీ కిడ్నాప్‌ చేశాడని తెలుసుకుంటుంది. లైవ్‌లోకి వచ్చిన గాడ్సే డిమాండ్స్‌ను, అతడి ఉద్దేశాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తుంది ఆమె. ప్రతి గంటకూ ఓసారి కొందరు మంత్రులతో, ఎంపీలతో మాట్లాడాలని కోరతాడు విశ్వనాథ్‌. ఈ క్రమంలో ఆమె గాడ్సే నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అతడు అంతలా మారడానికి కారణాల్ని అన్వేషిస్తుంది. దీని వెనుక రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని గుర్తిస్తుంది. అసలు గాడ్సే వారిని ఎందుకు కిడ్నాప్‌ చేశాడు? అతను ఏం చెప్పాలనుకున్నాడు ? బిజినెస్‌మేన్‌ కిడ్నాపర్‌ గాడ్సేగా ఎందుకు మారాడు? స్టేట్‌ మినిస్టర్స్‌తో, సీఎంతో గాడ్సే కుదుర్చుకున్న డీల్‌ ఏంటి? ఈ దేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటి? దీనిపై అతడు ఎందుకు పోరాటం చేశాడు? చివరికి గాడ్సే లక్ష్యం నెరవేరిందా? అనేది మిగతా కథ.
గాడ్సే తరహా కథ తెలుగు సినిమాకు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో జెంటిల్‌మేన్‌, అపరిచితుడు, ప్రతినిధి, శివాజీ సినిమాల్లో ఉన్న కథ ఇలాంటిదే. అయితే 'గాడ్సే'లో రాజకీయ నాయకులు చేసే అవినీతి, డొల్ల కంపెనీలు, షెల్‌ కంపెనీలు, వేలమంది గ్రాడ్యుయేట్స్‌కు ఉద్యోగాలు వంటి విషయాలను సినిమాలో చూపించారు దర్శకుడు. చదివిన చదువులకు తగ్గట్టు కొలువులు ఎంత మంది చేస్తున్నారు? అలాంటప్పుడు ఆ చదువులు ఎందుకు? కెరీర్‌కి పనికొచ్చే చదువులే చదువుకుంటే పోతుంది కదా.. అసలు ప్రభుత్వాలు నిరుద్యోగుల కోసం పాస్‌ చేసిన జీఓలను మధ్యలో ఆపుతున్నదెవరు? సూట్‌కేస్‌ కంపెనీల మాటేంటి? రాజకీయ నాయకులు నామినేషన్లలో చూపిస్తున్న ఆస్తుల
విలువ ఎంత? నిజానికి వారికున్న ఆస్తుల లెక్కలేంటి? వంటి అంశాలను ఆసక్తికరంగానే లేవనెత్తారు డైరక్టర్‌.
హీరో చెప్పిన డైలాగులు ప్రస్తుత రాజకీయ నాయకులకు సూటిగా తగులుతాయి. నిజమే కదా అనిపిస్తుంది. అయితే అనుకున్నది అనుకున్నట్లు చూపించడంలో కాస్త తడబడ్డాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే స్లోగా సాగుతుంది. అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు ఇబ్బందిపెడతాయి.
ఇంట్లోకి చొరబడి ఓ గర్భిణిని దుండగులు హోస్టేజ్‌గా తీసుకుంటారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంటుంది. దాంతో వైశాలీ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. ఉద్యోగం పట్ల నిబద్ధతను తెలియచెప్పాడు దర్శకుడు. సత్యదేవ్‌ పాత్ర ఎంటరయ్యాక సినిమాలో మరింతగా లీనమవుతారు ప్రేక్షకులు. కిడ్నాపులకు కారణమేంటి? అనే క్రమంలో వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను రేపుతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సొసైటీని ప్రశ్నించే సినిమాల కోవలో నిలుస్తుంది 'గాడ్సే'.
గాడ్సేగా సత్యదేవ్‌ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ని ఇచ్చాడు. డైలాగ్స్‌, ఎమోషన్స్‌ ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించాడు. పోలీసాఫీసర్‌ వైశాలిగా మలయాళ నటి ఐశ్వర్యాలక్ష్మి బాగా చేసింది. తెలుగులో మొదటి సినిమా అయినా ఆమె పాత్ర కొత్తగా అనిపించింది. సత్యదేవ్‌ ఫ్రెండ్స్‌గా నోయల్‌, గురుచరణ్‌, చైతన్యకృష్ణ, పవన్‌, సంతోష్‌ పాత్రలు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా మలయాళ నటుడు సిజ్జు మీనన్‌ పాత్ర ఫర్వాలేదనిపిస్తుంది. నాగబాబు, బ్రహ్మాజీ, తనికెళ్లభరణి, ప్రియదర్శి, మిర్చి మాధవి, శశికుమార్‌ రాజేంద్రన్‌, ఫృథీó్వరాజ్‌, తమ తమ పాత్రల పరిధి మేర నటించారు. సినిమాటోగ్రఫీ, సంగీతం మెప్పిస్తాయి. మొత్తానికి క్రైమ్‌ థ్రిల్లర్స్‌ ను ఇష్టపడే ప్రేక్షకులకు గాడ్సే చిత్రం బెటర్‌ ఆప్షన్‌.
టైటిల్‌: గాడ్సే
నటీనటులు : సత్యదేవ్‌, ఐశ్వర్యాలక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్లభరణి, సిజ్జు మీనన్‌, నోయల్‌, చైతన్య కృష్ణ, మ్యాథ్యూ వర్గీస్‌, నాగేంద్రబాబు, జియా ఖాన్‌, షిజు అబ్దుల్‌ రషీద్‌, పృధ్విరాజ్‌, ప్రియదర్శి, పవన్‌ సంతోష్‌, గురుచరణ్‌, శశికుమార్‌ రాజేంద్రన్‌ తదితరులు.
సంగీతం : శాండీ అద్దంకి, సునీల్‌ కశ్యప్‌,
సినిమాటోగ్రఫీ : సురేశ్‌ సారంగం, నిర్మాత: సి. కల్యాణ్‌ కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: గోపీ గణేష్‌ పట్టాభి