- జలదిగ్బంధంలో ముంపు మండలాలు, లంక గ్రామాలు
- బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రజాశక్తి- యంత్రాంగం : గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ముంపు మండలాలు, పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శనివారం వరద పోటు పెరుగుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. తమను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన శబరి ఒడ్డు, సంత పాకలు, వాడబజార్, బిసి, ఎస్‌టి కాలనీ, మెడికల్ కాలనీ ప్రజలు నివాసాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. విఆర్.పురం మండలంలో వరద ముంపునకు గురవుతున్న గిరిజనులను ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోలేదు. ఒడ్డుగూడెం గ్రామస్తులకు పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు ఎటువంటి వాహనాన్నీ ఏర్పాటు చేయలేదు. దీంతో, గ్రామస్తులే సొంతంగా రూ.3 వేలు పెట్టుకుని వాహనాల్లో తమ సామాన్లతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. నిరుపేదలు సామాన్లను తలమీద, భుజాల మీద మోసుకుంటూనే రేఖపల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కాలినడకన చేరుకున్నారు. మూడు కిలోమీటర్ల మేర లగేజీతో నడిచి వెళ్లడమంటే మాటలు కాదని, తమను అధికారులు పట్టించుకోలేదని ఆ గ్రామస్తులు వాపోయారు. ఎటపాక మండలంలోని పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులను, నీట మునిగిన గ్రామాల్లోని ప్రజలను సిపిఎం నాయకులు పరామర్శించారు. కూనవరం మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయి. తాగునీరు కూడా అందుబాటులో లేదు. పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు సందర్శించారు. చింతూరు మండల కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలైన శబరి ఒడ్డు, సంత పాకలు, వాడబజార్, బిసి, ఎస్‌టి కాలనీ, మెడికల్ కాలనీ ప్రజలు నివాసాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.
ఏలూరు కుక్కునూరు మండలం చీరవల్లి-వింజరం మధ్య రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఇప్పటికే పలు గ్రామాలకు చెందిన కుటుంబాలను పునరావాస కుక్కునూరులోని మసీదు బజార్, గణేష్‌నగర్, రజక బజార్ ప్రాంతాలకు చెందిన 120 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. కౌండిన్యముక్తి, బెస్తగూడెం ఎస్‌సి కాలనీకి చెందిన కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఇప్పటికే కుక్కునూరు ప్రధాన రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వరద నీరు చేరింది. భద్రాచలం వద్ద మరో రెండు, మూడు అడుగుల వరద పెరిగితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోనున్నాయి. వరద ఉధృతి పెరుగుతుండడంతో పునరావాస చర్యలను పర్యవేక్షించేందుకు వేలేరుపాడు మండలానికి నూజివీడు సబ్ కలెక్టర్‌ను, కుక్కునూరు మండలానికి ఐటిడిఎ పిఒను పర్యవేక్షకులుగా నియమించారు.
ముంపులో గోదావరి లంకలు
తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్.కోనసీమ జిల్లాల్లో 25 మండలాలపై వరద ప్రభావం పడింది. 48 లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో జి.పెదపూడిలంక, ఉడిముడిలంక, అరిగెల వారిపేట, బూరుగులంకలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అక్కడి ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. కొంతమందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. కాజ్‌వేలన్నీ నీట మునిగాయి. సఖినేటిపల్లి మండలంలో అప్పనారామునిలంక, సఖినేటిపల్లిలంక, కొత్తలంక, టేకిశెట్టిపాలెం, మలికిపురం మండలం రామరాజులంక, బాడవ గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. టేకిశెట్టిపాలెం పూర్తిగా నీట మునగడంతో ప్రజలు ఏటిగట్టుపై తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, నాలుగు ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో సుమారు 30 గ్రామాలు నీట మునిగాయి. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద బాధితుల కోసం 40 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు. పి.గన్నవరంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన శనివారం సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య సేవలపై ఆరా తీశారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లను పరిశీలించారు. ఏటిగట్ల పటిష్టతపై చర్యలు తీసుకోవాలని హెడ్ వర్క్స్, ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, అవసరమైన చోట్ల ఆహార సదుపాయాలు, పడవలు ఏర్పాటు చేశామన్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ దిగువన ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో వశిష్ట గోదావరి... లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆచంట మండలంలోని పుచ్చల్లంక, అయోధ్యలంకల్లోని పల్లపు ప్రాంతాల్లోకి, భీమలాపురం కాలనీలోకి శనివారం సాయంత్రం వరద నీరు ప్రవేశించింది. యలమంచిలి మండలంలో కనకాయలంక, పెద్దలంక, బాడవ, యలమంచిలిలంక, లక్ష్మీపాలెం, గంగడపాలెం, అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల, బూరుగుపల్లి తదితర గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. దీంతో, ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
గోదావరి వరద ప్రభావంతో మండలంలోని కాజ, నక్కల కాలువలు పోటెత్తి ప్రవహించడంతో వందలాది ఎకరాల్లో నారు మడులు నీట మునిగాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొడ్డిపట్ల చుట్టుపక్కల గ్రామాల వారికి దొడ్డిపట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పెదలంక, కనకాయలంక గ్రామాలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా లంకల్లో ఇప్పటికే రహదారులు నీట మునిగాయి. పెదమల్లంలోని మాచేనమ్మ ఆలయ ప్రాంగణం, పర్యాటక కేంద్రం, కోడేరులోని అపర కర్మల భవనం చుట్టూ నీరు చేరింది. కూరగాయ పంటలు నీట మునిగాయి. తమలపాకు తోటలు, అరటి తోటలకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఏటిగట్టు దిగువన ఉన్న లంక గ్రామాల్లోని కొబ్బరి తోటల్లో అంతర పంటలు నీట మునిగాయి. పశువుల పాకల చుట్టూ నీరు చేరడంతో రైతులు పశువులను ఏటిగట్టుపైకి, ఇతర సురక్షిత ప్రాంతాలకు పశువులను తరలించారు. ఇటుక బట్టీలు వరద నీటిలో నానుతున్నాయి.










