ప్రాచీన కళలు, కళాఖండాలు పండగల్లోనూ.. ఫంక్షన్లలోనూ ప్రధాన ఆకర్షణగా నిలిచేవి. శ్రమ ప్రాధాన్యత గలవాటిని ప్రేమకు గుర్తుగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవారు. రాను రాను వాటి కళ తగ్గిపోతోంది. కృత్రిమ తయారీ సాంప్రదాయ వస్తువుల వినిమయ తగ్గుదలకు దారితీస్తోంది. వస్త్రపరిశ్రమ ఎన్నో ఆటుపోట్లకు గురైనా.. నేటికీ ఎందరికో జీవనోపాధిని అందిస్తున్న కళ అద్దకం. రంగురంగుల ప్రపంచంలో అద్దకపు మెరుపులు కళాకారుల నైపుణ్యాన్ని ఉట్టిపడేలా చేస్తాయి.

వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇచ్చేవి నూలు వస్త్రాలు. చేనేత పరిశ్రమకు ప్రధానమైన ముడిసరుకు కాటన్ వస్త్రాలే. రంగుల అద్దకం వీటికి మరింత సొబగులను అద్దుతాయంటే అతిశయోక్తి కాదు. తరతరాలుగా కుటుంబాల్లో ఒకరి నుంచి మరొకరికి వస్తున్న సాంప్రదాయ కళ అద్దకం. ఈ నైపుణ్యం పెరూ నుంచి నైజీరియా, జపాన్ నుంచి పశ్చిమాసియా వరకూ వ్యాపించింది. చరిత్రలో ఈ కళకు మంచి గుర్తింపు ఉంది. ఇది వ్యక్తుల, సమూహాల స్థితి, విశ్వాసం, ఆచారాలను ఉట్టిపడేలా చేస్తుంది. అద్దకంలోని విభిన్న పద్ధతులు, శైలులు వేటికవే ప్రత్యేకమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కో దేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. బాందిని అని భారత్‌లో, ప్లంగి అని ఇండోనేషియాలో, అధైర్ అని నైజీరియాలో, అమర్రా అని పెరూలో, ఝారన్ అని చైనాలో, షిబోరి అని జపాన్‌లో పిలుస్తారు.
తెల్లని వస్త్రానికి రంగు పూయటమే అద్దకం. డిజైన్లను సృష్టించేందుకు వస్త్రాల్లో బియ్యపుగింజలు, రాళ్లు, చెక్కముక్కలు వంటివి ఉంచి, దారంతో ముడులువేసి రంగుల్లో నానబెడతారు. ఆపై ముడులను తీసేసి ఆరబెడతారు. ఈ విధానం ఎంతో శ్రమతో కూడుకున్నది. అద్దకంలో సమయం, ఉష్ణోగ్రత అనేవి ముఖ్యమైన అంశాలు. మొదట ఎవరు, ఎప్పుడు ఈ కళను కనిపెట్టారో కచ్చితమైన ఆధారాలేమీ లేవు. బ్రిటిష్ కాలంలో మన దేశం నుంచి రంగులను ఎగుమతి చేసేవారు. మనదేశంలో అందమైన అద్దకపు వస్త్రాలు లభిస్తాయని అలెగ్జాండర్ తన పుస్తకాల్లో రాసుకున్నారంటే.. వీటి ప్రాముఖ్యత ఎంతటిదో అర్థమవుతోంది. ప్రకృతి సిద్ధంగా లభించే రంగులతో చేసే ఈ అద్దకపు వస్త్రాలు కాలంతోపాటు వాటి మన్నికను కోల్పోతాయి. అందుకేనేమో పురావస్తు తవ్వకాల్లో అవి బయటపడటం అరుదు.
బాందిని : క్రీ.పూ.నాలుగువేల సంవత్సరాల నాటి సింధూ నాగరికత కాలం నాటి కళ బాందిని. గుజరాత్, రాజస్థాన్‌లో బాందిని తయారుచేస్తారు. చిన్నచిన్న తెల్లని చుక్కల డిజైన్లతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి వస్త్రాలు. పురాతనమైన ఈ డిజైన్లు అజంతా గుహల్లోని చిత్రాల్లో కనిపిస్తాయి. ఈ కళను పాటలు, కవిత్వాల్లో ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా వర్ణించేవారు. రాజస్థాన్‌లో పెళ్లి వస్త్రాలుగా వీటిని వాడతారు.

అమర్రా : క్రీ.శ 1,500 సంవత్సరాల క్రితం పెరూలో ఉద్భవించిన 'అమర్రా' అద్దకం అమెరికా అంతటా వ్యాపించింది. పదవ శతాబ్దపు ప్యూబ్లో తెగకు చెందిన అమర్రా వస్త్రాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చుక్కలు, డైమండ్ ఆకారాల్లో ఉండే ఈ డిజైన్ వస్త్రాలు చాలా అందంగా ఉంటాయి. గిరిజనులు ఈ డిజైన్లను వేయటం ఎంతో పవిత్రంగా భావిస్తారు. మతాధిపతులు ఇలాంటి వస్త్రాలను ధరించేవారని చిత్రాలు రికార్డుల పరిశీలన ద్వారా చెప్పగలుగుతున్నారు.
షిబోరి : జపనీయులకు చెందిన ఈ అద్దకానికి ఇండిగో మొక్కల నుంచి తీసే నీలిరంగును ఉపయోగిస్తారు. వరి కంకులను వస్త్రాల్లో ఉంచి, దానిని ముడి వేస్తారు. ఎంతో సమయం, శ్రమ వెచ్చించి చేయాల్సి ఉంటుంది. ఈ డిజైన్లలో లభించే సిల్కు వస్త్రాలు ఖరీదైనవి. ఎరుపు, నీలం, ఊదా రంగుల్లో అద్దకం వేస్తారు. ఎన్ని రకాలుగా ఈ వస్త్రాన్ని మడతపెట్టొచ్చో అన్ని విధాలుగా రకరకాల డిజైన్లను సృష్టిస్తారు.

అధిరే : నైజీరియాకు చెందిన యోరుబా తెగకు చెందిన మహిళలు ఈ అద్దకాన్ని కనిపెట్టారు. తెరూగా పిలిచే తెల్లని నూలు వస్త్రాలకు రంగు అద్దుతారు. స్థానికంగా లభించే 'ఏలూ' ఆకుల నుంచి ఈ రంగును సేకరిస్తారు. కుంచెలతో డిజైన్లను గీస్తారు. ఎక్కువ శాతం వృత్తాకారాల్లో ఈ డిజైన్లు కనిపిస్తాయి. ఈ వస్త్రాల తయారీలో మహిళలు ప్రధానపాత్ర పోషిస్తారు. ఈ అద్దకానికి గ్లోబల్ గుర్తింపు ఉంది.
కలంకారీ : ముడులు వేసి రంగులు అద్దడం ద్వారా డిజైన్ సృష్టించే విధంగా కాక బ్లాక్ ప్రింటింగ్‌పై రంగులు అద్దే హస్తకళ కలంకారి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ కళ క్రీ.పూ.3000 సంవత్సరాల క్రితానికి చెందినది. 'కలం', 'కారి' అనే పర్ష్యన్ పదాల నుంచి గ్రహించబడిన ఈ పదానికి 'పెన్నుతో గీసేది' అనే అర్థం వస్తుంది. భారత్‌తో పాటు ఇరాన్‌లోనూ ఈ అద్దకపు తయారీ నడుస్తోంది. కలంకారీకి ప్రసిద్ధి పొందిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లోని పెడన. 1972లో పిచ్చుక వీరసుబ్బయ్య ఈ కళను అభివృద్ధి చేసి, వర్తకాన్ని మొదలుపెట్టారు. కలంకారీలో శ్రీకాళహస్తి, మచిలీపట్నం అనే రెండు శైలులున్నాయి. హిందూ పురాణాలు, కథలు, దేవాలయాలు, జానపదాలు వంటి పౌరాణికాల గురించి తెలుపుతుంది శ్రీకాళహస్తి శైలి. రాజులు, కోటలు, ప్యాలెస్‌లు, జంతువులు, పక్షులు ఇలా రకరకాల డిజైన్లలో కనిపిస్తుంది మచిలీపట్నం శైలి. ఒక్కోటి ఒక్కో కథను వర్ణిస్తాయి. పర్యావరణహితమైన రంగులతో చేసే ఈ వస్త్రాలు కొన్ని రంగుల్లో మాత్రమే లభిస్తాయి. కలంకారీ బహుళ దశల ప్రక్రియ. ఈ అద్దకానికి ఉపయోగించే బ్రష్‌ను బెల్లం మిశ్రమంలో నానబెట్టి వాడతారు. కాటన్‌లోనే లభించే ఈ దుస్తులు ప్రస్తుతం సిల్క్‌లోనూ లభిస్తున్నాయి.

వస్త్ర ఉత్పత్తిలో వివిధ రకాల రంగుల కోసం కెమికల్స్ వాడుతున్నారు. 1850లో సింథటిక్ రంగుల వినియోగం మొదలైంది. రసాయనాల 'డై'లలో పనిచేసే కార్మికులు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. కెమికల్స్‌తో చేసే అద్దకపు వస్త్రాలను కాలువ నీటిలో కడగటం వల్ల నీరు కాలుష్యం అవుతోంది. ప్రకృతిలో లభించే ముడిపదార్థాలతో తయారయ్యే సాంప్రదాయ అద్దకపు వస్త్రాలు పర్యావరణహితమైనవి. కానీ చేతివృత్తినే నమ్ముకుని జీవనం సాగించే ఈ కళాకారులకు ఒకప్పుడు లభించినంత ఆదరణ ఇప్పుడు దొరకడం లేదు. దేశవ్యాప్తంగా సాంప్రదాయ దుస్తులకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. యాంత్రీకరణ, కంప్యూటర్ డిజైన్లతో సులువుగా తయారుచేసే వస్త్రాలు సాంప్రదాయ వస్త్రాల కన్నా తక్కువ ధరలకు లభించడంతో వీరికి గిరాకీ తగ్గిపోతోంది. తగిన ప్రోత్సాహకాలు కల్పించి, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది.

- సృజనాత్మకత పెంచుదాం..!
వేసవి సెలవుల్లో పిల్లలను ఎండలోకి వెళ్లకుండా పగటి సమయమంతా ఇండోర్ గేమ్స్ ఆడిస్తూ జాగ్రత్తపడతాం. ఆటలతోపాటు సృజనాత్మక పెంచే యాక్టివిటీస్ చేయిస్తూంటాం. దానిలో భాగంగా నేచురల్ డై తయారీ, బ్లాక్ ప్రింటింగ్, నూలు వడకడం వంటివీ నేర్పించొచ్చు. ఇలా చేయడం వల్ల వస్త్రాల తయారీ, కళాకారుల శ్రమ, పర్యావరణహిత రంగులు వంటివాటిపై వారికో అవగాహన వస్తుంది. విశాఖపట్నం పెదగాడి గ్రామంలో ఓ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. జమీల్య ఆధ్వర్యంలో సంకల్ప ఆర్ట్ పేరుతో నిర్వహించే దీనిలో సాంప్రదాయ దుస్తులు, చెక్కబొమ్మల తయారీ ప్రత్యేకమైనవి. రెండేళ్ల నుంచి వర్క్‌షాపు నిర్వహిస్తూ.. యువతలో నైపుణ్యాన్ని పెంచుతున్నారు. దానిమ్మ, ఉల్లిపాయ, పసుపు, మెంతులు, మంజిష్ట వేర్లు, అన్నట్టో గింజలు, యూకలిప్టస్ బెరడు వంటి వాటితో రంగులు తయారుచేస్తారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న పిల్లలు బంతి, గులాబీ పూల నుంచి పసుపు, పింక్ రంగులను తయారుచేసి, అద్దకం వేయటం నేర్చుకున్నారు.

కోడే హేమలత
9290735678










