ప్రజాశక్తి - ఆదోని (కర్నూలు) : ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరుద్యోగం, విద్యుత్ ఛార్జీలు, అధిక ధరలకు వ్యతిరేకంగా సిపిఎం అధ్వర్యంలో ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు చేపట్టి సమరభేరిని జయప్రదం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, సీనియర్ నాయకులు ఈరన్న, కార్యదర్శివర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న పిలుపునిచ్చారు. బుధవారం ఆదోనిలోని సుందరయ్య భవన్‌లో సమరభేరి కరపత్రాలను విడుదల చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు, రాయితీలు ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తు చేసి, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యవసరాలు అందించాలని, కరెంటు చార్జీలు తగ్గించాలని సిరసనల జయభేరిలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. అనంతరం పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో కరపత్రాలు పంపిణీ చేస్తూ, సంతకాలు సేకరణ చేపట్టారు.ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు వీరేష్, వెంకటేష్, నాగరాజ్, నాగేంద్ర, నాయకులు రామానాయుడు, అంజి, శివ, రామంజి, మెహన్,భీమా తదితరులు పాల్గొన్నారు.










