రేపు అమిత్‌షాతో భేటీ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలను వెంటనే ఇప్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కె సింగ్‌ను కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ఇద్దరు మంత్రులనూ సిఎం వేర్వేరుగా కలిశారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్నారు. అలాగే వామపక్ష ఉగ్రవాదంపై జరిగే సదస్సులో పాల్గననున్నారు. గురువారం పర్యటనలో భాగంగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పోలవరం. వెనుకబడిన ప్రాంతాల నిధుల అంశాన్ని ప్రస్తావించారు. దీంతోపాటు ఆర్థిక సంఘం నిధులను కూడా కోరినట్లు తెలిసింది. అలాగే ఆర్‌కెసింగ్‌తోనూ కనీసం గంటపాటు చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణా నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, కేంద్ర విద్యుత్ ప్రాజెక్టుల నుండి సరఫరా తదితర అంశాలపైనా చర్చించినట్లు తెలిసింది. తెలంగాణా నుండి రావాల్సిన బకాయిలు విడుదల చేయడం లేదని, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని ఇప్పించడం ద్వారా విద్యుత్ సంస్థలను ఆదుకున్నట్లు అవుతుందని విన్నవించినట్లు తెలిసింది. దీంతోపాటు ఎపిలో విద్యుత్ ఉత్పత్తికోసం చేపడుతున్న అనేక ప్రాజెక్టులపైనా సిఎం కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిసింది. ఆర్‌డిఎస్ రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ కింద రాష్ట్రానికి నిధులు ఇస్తామని కేంద్రమంత్రి సిఎంకు చెప్పినట్లు తెలిసింది. సిఎం వెంట వైసిపి పార్లమెంటరీపక్ష నాయకులు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సిఎస్ జవహర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.










