Jul 25,2023 16:04

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : రైతాంగ సమస్యలపై రెండో దశ పోరాటాలకు రైతుల సిద్ధం కావాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు జిల్లా రైతు సంఘాల సమన్వయ కమిటీ సమావేశం కార్మిక కర్షక భవన్లో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగానికి హాని కలిగించే మూడు వ్యవసాయ చట్టాలను, ఎలక్ట్రిసిటీ 2020ని రద్దు చేయాలని, పంటలన్నిటికీ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసిన విధంగా సమగ్ర పంట ఉత్పత్తి చేయాటానికి 50 శాతం కలిపి ఎంఎస్‌ పి నిర్ణయించాలని, పంట రుణాలను మాఫీ చేయాలని 500 రైతు సంఘాలు సంవత్సరం పైగా పోరాడిన లెక్కచేయని, ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా మలిదశ పోరాటం ప్రారంభించాలని కె .ప్రభాకర్‌ రెడ్డి పిలుపునిచ్చారు. జూలై నెల 13వ తేదీ సంయుక్త కిసాన్‌ కేంద్ర కమిటీ, సెంట్రల్‌ ఐక్యవేదికలో సమావేశమై కార్మికులు కర్షకుల డిమాండ్లను సాధించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా గౌతమ్‌ అదానీ ముఖేష్‌ అంబానీ వంటి ఆశ్రిత కార్పోరేట్లకు అమ్మి వేస్తూ ఉందన్నారు. కోల్‌, ఐరన్‌ గనులు దేశంలో పుష్కలంగా ఉన్న స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించకుండా నష్టాలకు కారణమవుతూ 22 వేల ఎకరాల భూమితో సహా మూడు లక్షల కోట్ల విలువ చేసే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మడానికి మోడీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగ కల్పనకు లోటు ఏర్పడుతుందని ఆయన విమర్శించారు. ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను సమైక్యంగా తిప్పి కొట్టాలన్నారు. అందుకు నాందిగా జరిగేటువంటి సంయుక్త కిసాన్‌ మోర్చా నిర్వహిస్తున్నటు వంటి రాష్ట్ర సదస్సుకు రైతాంగాన్ని రైతు నాయకులను పెద్ద ఎత్తున హాజరైటట్టు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం సీనియర్‌ నాయకులు బస్తిపాడు రామకృష్ణారెడ్డి, రైతు కూలీ సంఘం నాయకులు మల్లికార్జున, ఏ.ఐ.కె.కెఎంఎస్‌ నాయకులు ఖాదర్‌, అఖిలభారత రైతు స్కూల్‌ ఈ సంఘం నాయకులు నరసింహులు నాయకులు అల్లప్ప, ఏపీ రైతు సంఘం నాయకులు శ్రీనివాసరావు, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, ఏపీ రైతు సంఘం నాయకులు కృష్ణ, జి.ఆంజనేయులు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వెంకటేశులు తదితరులు మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా స్థిరీకరణ ఆయకట్టుకు సాగునీరు ఇస్తూ గోనెగండ్ల మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వాలని, కల్తీ విత్తనాలు అరికట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు. బీమా పరిహారం నష్టపోయిన పంటలన్నిటికీ ఇవ్వాలని ,పరిశ్రమల కొరకు మరియు ఆరు లైన్లు నాలుగు లైన్లు రోడ్డు కొరకు భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని ఇటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై జిల్లాలో రైతు సంఘాలన్నీ సమన్వయ కమిటీగా ఏర్పడి రాబోయే కాలంలో రైతులందరినీ సంఘటితపరిచి పోరాటానికి సిద్ధం కావాలని వారు విజ్ఞప్తి చేశారు.