Aug 20,2023 10:37

పచ్చని పంటపొలాలను చూసినా.. ఆకుపచ్చని ఆకుకూరల తోటలు కనిపించినా.. రంగురంగుల పండ్లవనాలు కంటబడినా.. స్పందించని మనిషి ఉండరు. అలాంటి ఆకుపచ్చని ఆకుకూరలను, కూరగాయలను, పువ్వులు, పండ్ల మొక్కలను పెంచాలనుకుంటున్నారా? అయితే ఎలా నాటుకోవాలి? ఏ వాతావరణంలో ఏ మొక్కలు పెరుగుతాయి? ఏ నెలలో ఏ విత్తనాలు నాటుకోవాలి? వంటి విషయాలు తెలిసుండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ మందులతో పండేవే. ధరలు కూడా విపరీతంగా ఉంటున్నాయి. మొన్నటి వరకు టమోట ధర ఆకాశాన్ని అంటింది. అందుకే ఉన్న కొద్దిపాటి స్థలంలో ఇంట్లో, బయట, మిద్దె మీద తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మొక్కలు పెంచుకుంటే సరి. దాంతో ఖర్చులూ తగ్గుతాయి. చక్కటి ఆరోగ్యం మన సొంతం అవుతుంది.

11

             ప్రకృతితో మహిళలకే అనుబంధం ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇంట్లోకి సరిపడ కూరగాయల మొక్కలు పెంచుకోవాలని ఎక్కువమంది ఆలోచన చేస్తున్నారు. దాంతో గూగుల్లో, యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఇస్తున్న సూచనలు, సలహాలతో మిద్దెతోటల పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, పండ్లు పండించి ఇంటి సభ్యుల ఆరోగ్యానికి దోహదపడుతున్నారు. ఉంటున్న ప్రాంతాన్ని బట్టి, చుట్టూ వాతావరణం, వేడి గాలి, వర్షాల ప్రభావం వల్ల మొక్కల ఎదుగుదల, కాపు కాయడంలో తేడాలుంటాయి. అయితే సాగుకు అనువైన మట్టి, సహజ ఎరువులు ఎంత ముఖ్యమో వాతావరణ అనుకూలం కూడా అంతే అవసరం. ఆకుకూరలైనా, కూరగాయలైనా మంచి విత్తనాలు ఎంచుకుని, కాలానుగుణంగా నాటుకుంటే మంచి కాపుని ఇస్తాయి. తెగుళ్లు, పురుగులు రాకుండా ఎప్పటికప్పుడు వేప పిండి, సహజంగా తయారుచేసుకునే ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజూ వచ్చే కూరగాయలు, పండ్ల తొక్కలను మట్టిలో కలిపి మొక్కలకు వేయొచ్చు. అయితే సంవత్సరం పొడువునా కొన్ని కూరగాయలు పండవు. మరి ఏ నెలలో ఏ కూరగాయల విత్తనాలు పెట్టుకోవాలో తెలుసుకుందాం.

బెండకాయ : వీటి విత్తనాలు నేరుగా కుండీల్లో పెట్టుకుంటే మూడు వారాలకు 20-32 డిగ్రీల వాతావరణంలో మొక్కలు వస్తాయి. దక్షిణ భారతదేశం ప్రాంతవాసులు (ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల్లో) వీటి విత్తనాలు సంవత్సరం మొత్తంలో ఎప్పుడైనా నాటుకోవచ్చు. అయితే మూడు, నాలుగు నెలలకు కాపు అయిపోతుంది. వెంటనే వీటిని తొలగించి, కొత్త విత్తనాలు వేసుకోవాలి. ఉత్తర భారతదేశం ప్రాంతవాసులు ఫిబ్రవరి, మార్చి, జూన్‌, జులై నెలల్లో విత్తనాలు పెట్టుకుంటే.. ఆ తర్వాత మూడు నెలలు బెండకాయలు కాస్తాయి.

టమోట : దక్షిణ ప్రాంతాల్లో జూన్‌ నుంచి ఫిబ్రవరి నెలల్లో నారు పోసుకోవాలి. నాలుగు వారాల్లో (22-32 డిగ్రీల వాతావరణంలో) మొక్కలు వస్తాయి. రెండు వారాల తర్వాత వాటిని వేర్వేరు కుండీల్లో వేసుకోవాలి. ఉత్తర ప్రాంతాల్లో జూన్‌, ఆగస్టు నెలల్లో, మళ్లీ నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో విత్తనాలు పెట్టుకోవాలి.

03

వంకాయ, పచ్చిమిర్చి : దక్షిణ ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా (20-30 డిగ్రీల వాతావరణం) వంకాయలు, పచ్చిమిర్చి కాస్తాయి. వీటిని ఏ నెలలోనైనా నారు పోసుకోవచ్చు. మొక్కలు వచ్చాక విడివిడిగా నాటుకోవాలి. ఏప్రిల్‌, మే నెలల్లో కాపు పెద్దగా ఉండదు. ఆయా నెలల్లో మొక్కలు ఎండిపోతుంటాయి.
నేతి బీరకాయ : దక్షిణ ప్రాంతాల్లో జూన్‌ నుంచి ఫిబ్రవరి వరకు (20-30 డిగ్రీల వాతావరణం) విత్తనాలు పెట్టుకోవచ్చు. చలికాలంలో కాపు బాగా కాస్తాయి. నేరుగా కుండీల్లో విత్తనాలు పెట్టుకోవాలి.

చిక్కుడు : దక్షిణ ప్రాంతాల్లో జూన్‌ నెలాఖరు నుంచి సెప్టెంబర్‌ నెల్లోపు విత్తనాలు (20-30 డిగ్రీల వాతావరణం) పెట్టుకోవాలి. ఈ విత్తనాలు నారు పోసుకుని పెట్టుకోవచ్చు. లేదా విడివిడిగానైనా కుండీల్లో పెట్టుకోవచ్చు. తీగ చిక్కుడు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కాపు ఉండదు. కాబట్టి చెట్టు చిక్కుడు విత్తనాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తనాలు పెట్టుకోవచ్చు.

దొండకాయ : దక్షిణ ప్రాంతాల్లో జూన్‌ నుంచి జనవరి వరకు (20-30 డిగ్రీల వాతావరణం) విత్తనాలు పెట్టుకోవచ్చు. చలికాలంలో కాపు బాగా కాస్తాయి. నేరుగా కుండీల్లో విత్తనాలు పెట్టుకోవాలి.

ఉల్లి : వీటి విత్తనాలు దక్షిణ భారత ప్రాంతవాసులు మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌లో (10-32 డిగ్రీల వాతావరణం) పెట్టుకోవచ్చు. మళ్లీ సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో పెట్టవచ్చు. మూడు వారాల్లో మొక్కలు వస్తాయి. వీటిని తీసి వేర్వేరు కుండీల్లో నాటుకోవాలి.

దోసకాయ : దక్షిణ ప్రాంతవాసులు సంవత్సరం మొత్తం విత్తనాలు (16-32 డిగ్రీల వాతావరణం) వేసుకోవచ్చు. ఇవి పూత ఎక్కువ పూస్తాయి, కానీ కాయలు తక్కువ కాస్తాయి. ఫిబ్రవరి, మార్చి నెలల నుంచి కాపు తగ్గిపోతుంది. ఉత్తర ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో విత్తనాలు వేయాలి. ఏప్రిల్‌, మే నెలల్లో కాయలు కాస్తాయి. నేరుగా కుండీల్లో విత్తనాలు పెట్టుకోవాలి.

క్యారెట్‌ : దక్షిణ ప్రాంతాల్లో జులై, ఆగస్టు, నవంబర్‌ నెలల్లో (10-30 డిగ్రీల వాతావరణం) విత్తనాలు పెట్టుకోవాలి. నేరుగా కుండీల్లో ఒక వరుస క్రమంలో పెట్టాలి. అప్పుడే అన్ని విత్తనాలకు బలం సమానంగా అందుతుంది. ఉత్తర ప్రాంతాల్లో ఆగస్టు, అక్టోబర్‌ నెలల్లో నాటుకోవాలి.

క్యాబేజి : దక్షిణ ప్రాంతాల్లో జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు (10-30 డిగ్రీల వాతావరణం) ఏ నెలల్లో అయినా విత్తనాలు పెట్టుకోవచ్చు. అయితే మొలకలు వచ్చిన తర్వాత వాటి వేరే కుండీల్లోకి మార్చాలి. ఉత్తర ప్రాంతాల్లో సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నాటుకోవాలి.

తీగ జాతి మొక్కలు : పుచ్చకాయ, గుమ్మడి, కర్బూజ విత్తనాలను దక్షిణ ప్రాంత వాసులు (22-32 డిగ్రీల వాతావరణం) ఏడాది పొడవున విత్తనాలు పెట్టుకోవచ్చు. వీటిని నేరుగా వేర్వేరు కుండీల్లో పెట్టుకోవాలి.ఉత్తర ప్రాంతవాసులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో విత్తనాలు పెట్టుకుంటే, నాలుగు వారాల్లో తీగ అల్లుకోవడం ప్రారంభిస్తుంది.

క్యాప్సికమ్‌ : దక్షిణ ప్రాంత వాసులు జూన్‌ నుంచి ఫిబ్రవరి నెలల (15-25 డిగ్రీల వాతావరణం) మధ్య నాటుకోవచ్చు. ఉత్తర ప్రాంత వాసులు మే, జూన్‌ నెలల్లో, మళ్లీ నవంబర్‌, జనవరి నెలల్లో విత్తనాలు పెట్టుకోవాలి. ఒకచోట నారు పోసుకుని, మొలకలు వచ్చాక, వేర్వేరు కుండీల్లోకి నాటుకోవాలి.

సొరకాయ : దక్షిణ ప్రాంత వాసులు జూన్‌ నుంచి జనవరి నెలల్లో (20-30 డిగ్రీల) విత్తనాలు పెట్టుకోవాలి. ఉత్తర ప్రాంత వాసులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో, మళ్లీ జూన్‌, జులై నెలల్లో విత్తనాలు నాటుకోవాలి. వీటి విత్తనాలు నేరుగా వేర్వేరు కుండీల్లో నాటుకోవాలి.

బీరకాయ, కాకర : దక్షిణ ప్రాంతాల్లో సంవత్సరం మొత్తం కాపు కాస్తాయి. అయితే వీటి విత్తనాలు పెట్టేటప్పుడు కొంచెం చల్లని వాతావరణం (20-30 డిగ్రీల) వద్ద వేర్వేరు కుండీల్లో నాటుకోవాలి. ఉత్తర ప్రాంత వాసులు ఫిబ్రవరి, మార్చి నెలల్లో, మళ్లీ జూన్‌, జులై నెలల్లో విత్తనాలు నాటుకోవాలి.

క్యాలీఫ్లవర్‌ : దక్షిణ, ఉత్తర ప్రాంతాల్లో (25-27 డిగ్రీల వాతావరణం) జూన్‌ నుంచి నవంబర్‌ నెలల్లో విత్తనాలు పెట్టుకోవాలి. డిసెంబర్‌ వరకు కాపు వస్తుంది. మొదట నారు పోసుకుని, మొలకలు వచ్చాక విడివిడిగా కుండీల్లో నాటుకోవాలి.
బంగాళదుంప : ఇది చలికాలం పంట. దక్షిణ ప్రాంతాల్లో (10-20 డిగ్రీల వాతావరణం) అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలల్లో మాత్రమే విత్తనాలు పెట్టుకోవాలి. విడివిడిగా విత్తనాలు కుండీల్లో నాటుకోవాలి.

బఠాణి : ఇవి కూడా వాతావరణం చల్లగా ఉన్నప్పుడే నారు పోసుకోవాలి. దక్షిణ ప్రాంతాల్లో (10-20) సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ నెలల్లో విత్తనాలు పెట్టుకోవాలి. మూడు వారాల తర్వాత మొక్కలను వేర్వేరు కుండీల్లో నాటుకోవాలి.

అల్లం : దక్షిణ ప్రాంతాల్లో మే, జూన్‌ (20-30 డిగ్రీల వాతావరణం) నెలల్లో అల్లం కొమ్ములు పెట్టుకోవాలి. నేరుగా కుండీల్లో పెడితే సరిపోతుంది.
బీట్‌రూట్‌ : దక్షిణ ప్రాంత వాసులు ఎండలు తగ్గి, వాతావరణం చల్లబడినప్పుడు (10-30 డిగ్రీల వాతావరణం) విత్తనాలు పెట్టుకోవాలి. జులై, డిసెంబర్‌ నెలల్లో అనువుగా ఉంటుంది. వీటిని నేరుగా వేర్వేరు కుండీల్లో నాటుకోవాలి. ఉత్తర ప్రాంత వాసులు అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో విత్తుకోవాలి.

44

                                                                           మిద్దెతోట లాభాలు

చాలా మంది ఇంట్లో స్థలం లేదని, ఇరుకు గదులని, వాతావరణం అనుకూలంగా ఉండదని, చుట్టూ కాలుష్యం, మొక్కలు పెంచేందుకు సమయం కేటాయించలేమని అంటూ ఉంటారు. కానీ మొక్కల పెంపకం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం అలుముకుంటుందని నిపుణులు అంటున్నారు.
ఉదయాన్నే లేవగానే పచ్చని మొక్కలు కనిపిస్తే కళ్లకు మంచిది. పని వల్ల ఒత్తిడి, ఆందోళన సమయాల్లో మనం పెంచుకుంటున్న మొక్కలు చూస్తే మనసుకు తెలియని ఆహ్లాదం కలుగుతుంది. అంతేకాదు మొక్కల పెంపకం వల్ల శరీరానికి మంచి వ్యాయామం. ఇంటికి చల్లదనం, పురుగు మందులు లేని ఆహారం తినొచ్చు. ఇరుగుపొరుగుతో ఇచ్చిపుచ్చుకోవడం, మాటామంచి పెరుగుతాయి. మనుషుల్లో సృజనాత్మకత వంటి అనేక ప్రయోజనాలుంటాయి. చెట్లు స్వచ్ఛమైన గాలి, చల్లదనం ఇవ్వడంతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. మన చుట్టూ 0.1 శాతం పచ్చదనం పెరిగినా జీవితకాలం ఎంతోకొంత మెరుగవుతుందని తాజా పరిశోధన చెబుతుంది. మరి ఆలస్యం చేయకుండా మనం మొక్కలు పెంచేసుకుందాం.

పద్మ
94905 59477