Sep 10,2023 22:20

-నవంబర్‌లో వర్చ్యువల్‌ సమావేశాలు
- ఐరాసను సంస్కరించాలన్న మోడీ
-తదుపరి అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్‌కు అప్పగింత
న్యూఢిల్లీ : జి20 శిఖరాగ్ర సమావేశాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ప్రస్తుతం జి20 దేశాలకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న భారత్‌ తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించింది. కాగా సదస్సులో చర్చించిన అంశాల పురోగతిపై నవంబరు నెలాఖరులో వర్చువల్‌ సమావేశాలు నిర్వహిద్దామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. సభ్యదేశాలన్నీ ఇందులో పాల్గోనాలని ఆయన ఆకాంక్షించారు. రోషనల్‌ పద్ధతిలో జి20 అధ్యక్షత బాధ్యతలు బదిలీ అవుతాయన్న సంగతి విదితమే. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి జి20 దేశాలకు బ్రెజిల్‌ అధ్యక్షత వహించనుంది. అప్పటి వరకు అంటే ఈ ఏడాది నవంబరు వరకే జి20కి ఇండియానే అధ్యక్షత వహిస్తుంది. జి20 శిఖరాగ్ర సదస్సు ముగింపు సందర్భంగా న్యాయదండాన్ని (గావెల్‌ - చిన్నసుత్తి)ని బ్రెజిల్‌ అధ్యక్షులు లులా డిసిల్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందజేసి అధ్యక్షత బాధ్యతలు అప్పగించారు. ప్రపంచ ఐక్యత, సమృద్ధి కోసం అంకితభావంతో, దార్శనికతతో బ్రెజిల్‌ నాయకత్వం వహించగలదన్న విశ్వాసం తమకుందని ఈ సందర్భంగా మోడీ పేర్కొన్నారు. తదుపరి జి20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని విధాలుగా బ్రెజిల్‌కు భారత్‌ సహకారం అందిస్తుందని తెలిపారు. నవంబరు వరకే జి20 అధ్యక్షతను భారత్‌ నిర్వహిస్తుందని, అంటే ఇంకా రెండున్నర నెలలున్నాయని, సదస్సులో నిర్ణయించిన అంశాల పురోగతిపై వర్చ్యువల్‌గా సమీక్ష నిర్వహించాల్సివుందని మోడీ ప్రతిపాదించారు. ఈ వర్చ్యువల్‌ సమావేశాలకు సభ్యదేశాలన్నీ హాజరవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి చేకూరాలన్నదే భారత్‌ ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. సామాజిక భద్రత, ద్రవ్య, ఆర్థిక స్థిరత్వం వంటి వాటికి తోడు ఈ దఫా క్రిప్టో కరెన్సీ కొత్తగా అంశంగా తోడైందని మోడీ అన్నారు. క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు అవసరమని ఆయన చెప్పారు. జి20 శిఖరాగ్ర సదస్సు విజయవంతానికి సహకరించినందుకు 140 కోట్ల మంది భారతీయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మోడీ తెలిపారు.

  • అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవశ్యం : మోడీ

ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలను తక్షణమే చేపట్టాల్సిన అవసరముందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధానంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య పెరుగుదలపై దృష్టిసారించాలని ఆయన కోరారు. ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్య మారడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 51 దేశాలతో ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తొలి రోజుల్లో పరిస్థితులు వేరు అని పేర్కొన్న మోడీ ..ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 200కు చేరువైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాలానికి అనుగుణంగా ఎవరైతే మార్పు చెందరో ..వారు ప్రాముఖ్యాన్ని కోల్పోతారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు సభ్యదేశాలు అమెరికా, రషా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ మాత్రమే ఉన్నాయి. శాశ్వత సభ్యదేశాలను పెంచాలని భారత్‌ దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.