Sep 11,2023 10:51

న్యూఢిల్లీ :  జి20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు  ఢిల్లీకి విచ్చేసిన వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఆదివారం  రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌కు వచ్చిన నేతలకు, అధికారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్మానం పలికారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన గుజరాత్‌ సబర్మతి ఆశ్రమం ఫొటో గురించి ప్రధాని విదేశీ అతిథులకు వివరించారు. అమెరికా అధ్యక్షులు జోరు బైడెన్‌, బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునక్‌, బ్రెజిల్‌ అధ్యక్షులు లులూ దిసిల్వా, ఫ్రాన్స్‌ అధినేత ఎమ్మాన్యుల్‌ మేక్రాన్‌ తదితర సభ్యదేశాల అగ్రనాయకులు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గన్నారు. మహాత్మగాంధీ సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫలకంపై సంతకాలు చేశారు. తర్వాత అతిథి నేతలంతా భారత మండపంలోని లీడర్స్‌ లాంజ్‌కు వెళ్లారు.

విభిన్న దేశాలకు చెందిన అధినేతలంతా కలిసికట్టుగా గాంధీజీకి నివాళులర్పించారని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. శాంతి, సేవానిరతి, కరుణ, అహింసకు ద్వీపధ్వజంగా వర్ధిల్లిన మహాత్మాగాంధీకి జి20 కుటుంబం శ్రద్ధాంజలి ఘటించిందని ఆయన పేర్కొన్నారు. సామరస్యపూర్వకమైన, సమ్మిళిత, సుసంపన్న ప్రపంచ భవిష్యత్తు కోసం సమిష్టి దార్శనికతకు మహాత్మాగాంధీ కాలాతీతమైన మార్గదర్శి అని మోడీ ఈ సందర్భంగా కొనియాడారు.

మేక్రాన్‌తో విందు భేటీ
జి20 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారం కూడా వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. దైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించిన అనంరతం మధ్యాహ్న భోజనం సమయంలో ఫ్రాన్స్‌ అధ్యక్షులు ఎమ్మాన్యుల్‌ మేక్రాన్‌తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ విందు భేటీలో ఇరు దేశాల మంత్రులు, దౌత్య ప్రతినిధులు కూడా పాల్గన్నారు. ఇరుదేశాల సంబంధాలను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు దోహదం చేసే అనేక అంశాలపై చర్చలు జరిపినట్లు ప్రధాని మోడీ పోస్టు చేశారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెయూతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల సంబంధాలపై చర్చలు జరిపినట్లు మోడీ తెలిపారు. అలాగే జి20లో తాజాగా శాశ్వత సభ్యత్వం పొందిన ఆఫ్రికా యూనియన్‌ అధ్యక్షులు అజలి అసమానితో కూడా మోడీ దైపాక్షికంగా సమావేశమయ్యారు. జి20లో చేరినందుకు మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. టర్కీ అధ్యక్షులు ఆర్‌టి ఎర్డోగాన్‌తోనూ, జర్మనీ ఛాన్సలర్‌ బందేస్కంజ్లర్‌ ఒలాఫ్‌ స్కూల్జ్‌తోనూ, బ్రెజిల్‌ అధ్యక్షులు లులా డ సిల్వాతోనూ మోడీ వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్‌, బ్రిజెల్‌ మధ్య సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయని ఈ సందర్బంగా మోడీ చెప్పారు. వ్యవసాయం, సాంకేతిక, ఇతర రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం, వాణిజ్య వృద్ధి పెంపొందించడంపై చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు.
 

భారత్‌కు అభినందనలు
చారిత్రక జి20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు భారత్‌ను అమెరికా అధ్యక్షులు జోరు బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, టర్కీ అధ్యక్షులు ఎర్డోగన్‌ తదితర దేశాధినేతలు అభినందించారు. ఉక్రెయిన్‌పై తీర్మానాన్ని రష్యా సమర్థించింది. మాస్కోపై నేరుగా విమర్శలు చేయకుండా సమతూకం పాటించారని రష్యా విదేశాంగ మంత్రి లవ్‌రోవ్‌ చెప్పారు. అయితే ఉక్రెయిన్‌పై జి20 సదస్సు ఆమోదించిన తీర్మానాన్ని జపాన్‌ ప్రధాని కిషిడా తోసిపుచ్చారు. ఇది బలహీనమైన తీర్మానమని వ్యాఖ్యానించారు. పర్యావరణంపై ప్రజలలో అవగాహన కలిగించేందుకు సభ్య దేశాల నేతలు భారత్‌ మండపంలో మొక్కలు నాటారు. కాగా సదస్సు చివరి సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరు కాలేదు. ఆయన వియత్నాం బయలుదేరి వెళ్లారు.
 

అక్షరధామ్‌లో రుషి సునక్‌ పూజలు
బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునక్‌ దంపతులు ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను హిందువునని, హిందువుగానే పెరిగానన్నారు. భారతీయ సంప్రదాయాలంటే తనకెంతో గౌరవమని చెప్పారు. రక్షాబంధన్‌ కూడా ఘనంగా జరుపుకున్నామని, తన సోదరి, తోబుట్టువులు రాఖీలు పంపారని ఆయన తెలిపారు.