ప్రజాశక్తి- పార్వతీపురం కలెక్టరేట్ : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కు బడ్జెట్లో నిధులు పెంచాలని కోరుతూ సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా చేశారు. ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. ధర్నాలో యూనియన్ జిల్లా నాయకులు ఎం.శివాని మాట్లాడుతూ ఎన్‌హెచ్‌ఎంకు బడ్జెట్లో నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆశా వర్కర్లకు పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పర్మినెంట్ చేయాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, పింఛను అమలును చేయాలని, ఆశా వర్కర్లపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. సిహెచ్‌డబ్ల్యులకు బకాయి వేతనాలు చెల్లించాలని, వారిని ఆశా వర్కర్లుగా గుర్తించాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.రమణరావు, ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు మాట్లాడుతూ కోవిడ్ కాలంలో ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి పని చేశారని తెలిపారు. ప్రభుత్వం వారి రక్షణకు కనీస భరోసా కల్పించకపోవడం శోచనీయమన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన, సహజ మరణం సంభవించిన వారి కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని, ఆశా వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఏ నెల వేతనం ఆ నెల సకాలంలో చెల్లించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు.










