Sep 12,2023 11:30

 ఆందోళనకు బెంగాల్‌ రవాణా కార్మికుల పిలుపు
 కనీస పెన్షన్‌, ఎనిమిది గంటల పనితో సహా 14 డిమాండ్లు.. సిఐటియు మద్దతు


కోల్‌కతా : తమ డిమాండ్లు, హక్కుల సాధన కోసం పశ్చిమ బెంగాల్‌లోని రవాణా రంగానికి చెందిన కార్మికులు, ఉద్యోగులు ఏకమయ్యారు. రాష్ట్ర రవాణా కాకుండా ఇతర అన్ని రవాణా రంగాలలో నెలవారీ కనీస పింఛను రూ.9,000 ఇవ్వాలని, ఎనిమిది గంటల పని దినాలను కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మొత్తం 14 డిమాండ్ల సాధన కోసం వారు పోరాడుతున్నారు. ఈ మేరకు వారు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి పోరాటానికి సిఐటియు బాసటగా నిలిచింది.
ఉపాధి పత్రాలు, గుర్తింపు కార్డులు, ఎనిమిది గంటల పని దినాలు, ఆరోగ్య బీమా సహా సామాజిక భద్రతా పథకాల అమలు, అక్రమార్కుల దోపిడీని అరికట్టడం, పెట్రోలియం ఉత్పత్తుల ధరల తగ్గింపునకు చర్యలు, వివిధ రహదారుల పునరుద్ధరణ, పండుగలకు ముందు బోనస్‌లు మరియు అలవెన్సుల చెల్లింపు, ప్రయాణికుల ఛార్జీలను నిర్ణయించడంలో ప్రభుత్వ సహాయం వంటివి వీరి డిమాండ్‌లలో ఉన్నాయి. కోల్‌కతాలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పశ్చిమ బెంగాల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ వర్క్‌షాప్‌ జరిగింది. సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. ''కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిబంధనల పేరుతో శ్రామిక ప్రజల ఆర్జిత హక్కులను నిర్వీర్యం చేసేందుకు లేబర్‌ కోడ్‌లను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా నిరసనలు రావాలి'' అని అన్నారు. రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికులు ఏకం కావాలనీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు.