Jul 09,2023 08:51

స్నేహంగా మెలగడం అనేది ఏ బంధంలో అయినా మరింత అనుబంధాన్ని పెంచుతుంది. ప్రేమానురాగాలు పెనవేసుకోవాలంటే అది భార్యాభర్తలయినా స్నేహంతోనే సాధ్యం. నేటితరం పిల్లలు మనకన్నా కొన్ని కొన్ని విషయాల్లో పరిజ్ఞానం పెంచుకుని ఉన్నారు. అయితే తల్లిదండ్రులు జీవితంలో ఎదుర్కొన్న విషయాలు వారికి తెలియకపోవచ్చు. అందుకే వారికి అనుభవం అవసరం. అనుభవపూర్వకంగా తెలుసుకోవడం అన్నింటికీ సాధ్యం కాదు. కొన్ని విషయాల్లో తల్లిదండ్రుల అనుభవాలే వారికి పాఠాలు కావాలి. ఇవన్నీ వారికి చెప్పడంలో పెత్తనం చేసినట్లు, అరిచి, కసురుకుని చెప్పడం కాకుండా.. స్నేహపూర్వకంగా తెలియజేయడం మంచి ఫలితాలు ఇస్తుందంటున్నారు నిపుణులు.
పిల్లలు చిన్నతనం అంతా బాగానే ఉంటారు. కానీ 12 ఏళ్లు దాటిన తరువాత వారి ప్రవర్తనలో మార్పు రావడం ప్రారంభం అవుతుంది. 12-15 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు వారిలో ఊహించని మార్పును గమనించవచ్చు. ఎంత గొప్ప పేరెంటింగ్‌ చేసినా ఈ స్థాయిలో పిల్లల ప్రవర్తనలో మార్పు సహజం. ఈ స్థాయిలోనే సరయిన పేరెంటింగ్‌ చాలా ముఖ్యం.

2


సహజంగా ఈ స్థాయిలో పేరెంట్స్‌ ఇద్దరి మధ్య సఖ్యత లోపించడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో మొదటిలో ఉన్న ఆకర్షణ క్రమంగా 15 ఏళ్ల తర్వాత తగ్గడం జరుగుతూ ఉంటుంది. బాధ్యతలు పెరగడం, అందుకనుగుణంగా ఆర్థిక భారాలు తడిసి మోపడవడం.. ఫలితంగా దంపతుల మధ్య ఏదో ఒక విషయంలో వ్యతిరేకతలు వ్యక్తమవుతూ ఉంటాయి. అదే సమయంలో పిల్లలు టీనేజికి రావడం జరుగుతుంది.

  • సొంత అభిప్రాయాలు..

ఎప్పుడయితే పిల్లలు తల్లిదండ్రులను వ్యతిరేకిస్తూ సొంతంగా అభిప్రాయాలను ఏర్పర్చుకుంటారో.. నిర్ణయాలు స్వయంగా తీసుకుంటూ ఉంటారో అప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి. పొరపాట్లు జరగగానే పేరెంట్స్‌ విపరీతంగా రియాక్ట్‌ అవుతారు. అంతే కాకుండా పిల్లలు క్రమశిక్షణ తప్పుతున్నారేమో అనే భయం తల్లిదండ్రుల్లో మొదలవుతుంది. ఆ భయంతో పేరెంట్స్‌ మధ్య 'ఈ స్థితికి నువ్వంటే నువ్వు కారణం!' అని ఆరోపణలు చేసుకుంటూ, నిరూపించే ప్రయత్నమూ తెలియకుండానే మొదలవుతుంది.
ఈ స్థాయిలో పిల్లలు చేసే ప్రతీ తప్పూ ఎదుటి భాగస్వామికి అన్వయించి, ఎత్తి చూపుతారు. 'నీ వల్లనే ఇలా అయ్యింది, నేను మొదటి నుంచి చెబుతున్నాను, నెత్తినోరూ మొత్తుకుని చెప్తున్నాను' అంటూ వారి యాంగ్జైటీ మొత్తాన్ని ఎదుటి పార్ట్నరు మీద డంప్‌ చేస్తుంటారు. భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలుంటే అవి మరింత ఎక్కువవుతాయి. కొన్నిసార్లు ఇరువైపుల పెద్దల జోక్యంతో సమస్య మరింత జఠిలం అవుతుంది.
ఈ స్థాయిలో తల్లిదండ్రుల మధ్య సమన్వయం, సహనం చాలా అవసరం. ఈ సందర్భాలలో ఓర్పుతో, విచక్షణతో వ్యవహరించాలి. తల్లిదండ్రులు బెంబేలెత్తి పోకూడదు. పిల్లలు సహజంగానే బౌండరీస్‌ దాటే ప్రయత్నం చేస్తారు. ప్రతీ ప్రయత్నంలో వారు కొత్త విషయాలను నేర్చుకుని, అది సరైనది కాదు అనుకున్నపుడు తిరిగి వెనకకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో తల్లిదండ్రులు అనుభవజ్ఞుల్లా ప్రవర్తించాలి. కానీ తల్లిదండ్రులు ఒకరినొకరు లేదా పిల్లలను నిందించకూడదు. కొందరు కొడతారు, తిడతారు కూడా. అది సరికాదు.

4


పిల్లలు 'ట్రయిల్‌ అండ్‌ ఎర్రర్‌ మెథడ్‌' లో అనేక విషయాల పట్ల అవగాహన పొందుతూ ఉంటారు. కేవలం 'ట్రయిల్‌ అండ్‌ సక్సెస్‌ మెథడ్‌' ఉండదు. పిల్లల ప్రయత్నాన్ని ముందు అభినందించండి. వారు చేసే ప్రయత్నం సత్ఫలితాలు ఇవ్వదని మీకు అర్థమైనా వెంటనే మీ టాలెంట్‌ని వారి మీద చూపించకండి. వారి ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. తల్లిదండ్రులు ఒకరినొకరు నిందించుకోవడం కన్నా ఆ విషయంపై ఏం చేయాలో చర్చించుకోండి. పిల్లలు ఏ విషయమైనా పేరెంట్స్‌తో పంచుకునే అవకాశం కల్పించండి. తప్పు చేసినా మనతోనే నిర్భయంగా చెప్పగలిగే వాతావరణం ఉండాలి.అప్పుడే పిల్లలు దారి తప్పకుండా ఉండగలుగతారు.
పిల్లలతో మాట్లాడేటప్పడు పెద్దరికంగా, కళ్లు పెద్దవి చేసి మాట్లాడకండి. స్నేహపూర్వకంగా ఒక దగ్గర కూర్చోవడం, లేదా బయటకు వెళ్లడం. వాళ్లంతట వాళ్లే తమ విషయాలన్నీ గోప్యం లేకుండా మన దగ్గర వ్యక్తపరిచేలా వాతావరణం కల్పించండి. మీరు వారితో కొన్ని విషయాలు పంచుకుంటే.. వారూ మీతో తప్పక తమ విషయాల్ని భయం లేకుండా చెప్పగలుగుతారు. ఫ్రెండ్‌లా ఉండటం అలవాటు చేసుకోవాల్సింది తల్లిదండ్రులే. ఎప్పుడైతే అలా ఉంటారో, పిల్లలు స్నేహంగా అల్లుకుపోవడం అత్యంత సహజంగా జరుగుతుంది. ఇప్పటికే పరిస్థితి చేయిదాటిపోతే, ఇరువైపులా సరిజేసుకోవాల్సినవి ఉన్నాయనే అర్థం. అందుకు స్వయంగా సరిదిద్దుకోవడం వీలుకాకపోతే, సైకాలజిస్టుని సంప్రదించి తగిన సహాయం పొందండి. పిల్లలతో ప్రేమగా వ్యవహరించడం పరిష్కారం అని మరిచిపోకండి. వాళ్లని ప్రేమిస్తే తిరిగి మనల్ని బోలెడంత ప్రేమిస్తారు. బయట ఆకర్షణలకు, అవగాహన లేనివారితో పంచుకోవడం ఆగిపోతాయి. మరి ఫ్రెండ్లీ పేరెంటింగ్‌ అంతిమంగా పరిష్కారం!