- ఎసి బోగీల నుంచి తరచూ పొగలు, మంటలు
- మెకానిక్‌ల కొరతే కారణం!
- సంస్కరణల ప్రభావంతో పెరుగుతున్న పనిభారం
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : రైలు ఎసి బోగీలో నుంచి పొగలు, మంటలు రావడం వంటి ఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో రైల్వేల్లో తీసుకొచ్చిన మార్పులే ఇటువంటి ఘటనకు కారణమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పర్మినెంట్ సిబ్బందిని తగ్గించడం, ఉన్న వారిపై పనిభారం మోపడం, శాశ్వత ఉద్యోగుల స్థానంలో తక్కువ వేతనం ఇచ్చి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పనిచేయించడం సంస్కరణల్లో భాగమయ్యాయి. ఇవి ప్రమాదాలకు కారణమౌతున్నాయని చెబుతున్నారు. గత నెల నాల్గవ తేది నుంచి ఈ నెల 25 వరకూ జరిగిన ఘటనలు పరిశీలిస్తే సంస్కరణల పేరుతో అమలు చేస్తున్న విధానాలు రైల్వేలో ప్రమాద ఘంటికలను తెలియజేస్తున్నాయి.
ప్రముఖ యాత్రా స్థలమైన తిరుపతి మీదుగా ప్రతి రోజూ 58కిపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 30 రైళ్లు తిరుపతి నుంచే బయలుదేరుతున్నాయి. ఆదాయం పెంచుకునేందుకు జనరల్ బోగీలను తగ్గించి ఎసి బోగీలను ప్రభుత్వం పెంచుతోంది. వందే భారత్ రైలులో అన్నీ ఎసి కోచ్‌లే ఉన్నాయి. మిగిలిన రైళ్లు దాదాపు పది ఎసి కోచ్‌లతో నడుస్తున్నాయి. సుమారు 300 ఎసి కోచ్‌లతో ఇక్కడి నుంచి రైళ్లు బయల్దేరుతున్నాయి. గతంలో మూడు ఎసి బోగీలకు ఒక ఎసి మెకానిక్ ఉండేవారు. రైల్వేలో సంస్కరణల ప్రభావంతో ప్రస్తుతం పది ఎసి బోగీలకు రైల్వే శాఖ నుంచి ఎసి మెకానిక్ ఒకరు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒకరు ఉంటున్నారు. వీరిద్దరే మొత్తం పది బోగీలనూ పర్యవేక్షించాల్సి వస్తోంది. తిరుపతి పరిధిలో 90 మంది ఎసి మెకానిక్‌లు ఉండాల్సి ఉండగా, కేవలం 30 మందే ఉన్నారు. ఎసి మెకానిక్‌తో రోజుకు ఎనిమిది గంటలు పనిచేయించుకోవాలి. అదనంగా పని చేయించుకుంటే ఓవర్ టైం అలవెన్స్ ఇవ్వాలి. 'ఓవర్ టైం అలవెన్స్' భారం తగ్గించుకునే పేరుతో అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఉదాహరణకు తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే నుంచి ఎసి మెకానిక్ ఉంటారు. ఆ రైలు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లి, అక్కడి నుంచి తిరిగి తిరుపతి రావడానికి దాదాపు 36 గంటలు పడుతుంది. పర్మినెంట్ ఉద్యోగి అయితే జీతం కంటే ఓవర్ టైం అలవెన్స్ ఎక్కువగా చెల్లించాల్సి వస్తుందనే పేరుతో రూ.15 వేలు వేతనం ఇచ్చి అవుట్ సోర్సింగ్ కార్మికునితో పని చేయించుకున్నారు. వీరు క్వాలిఫై పర్సన్ కాకపోవడంతో హెల్పరుగానే ఉంటున్నారు. ఎసి మెకానిక్కే పనంతా చేయాల్సి వస్తోంది. దీంతో, పని భారం పెరుగుతోంది. మూడు ఎసి బోగీలకు ఒక ఎసి మెకానిక్ ఉండేటప్పుడు ఎప్పటికప్పుడు ఎసి బోగీలను పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే పరిష్కరించేవారు. ఇప్పుడు పది బోగీలకూ ఒక్కరే ఉండడంతో గతంలోలా పర్యవేక్షణ సాధ్యం కావడం లేదు.
ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలు
- జులై 4న ఆదిలాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ బి-1 కోచ్‌లో మంటలు వచ్చాయి. మంటలను ఆర్పి, సాంకేతిక సమస్యను సర్దుబాటు చేసి గంట ఆలస్యంగా పంపించారు.
- ఈ నెల 10న సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న వందే భారత్ రైలులో వరంగల్ వద్ద పొగలు వచ్చాయి.
- ఈ నెల 25న వెంకటగిరి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎసి బోగీ నుంచి పొగలు వచ్చాయి. ప్రయాణికులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
- ఈ మూడు ఘటనలూ తిరుపతి మీదుగా నడిచే రైళ్లలో జరిగినవి మాత్రమే. తిరుపతి మీదుగా రాని రైళ్లలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఘటనలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి.










