జి20 దేశాధినేతల ఉద్ఘాటన
సదస్సులో తీర్మానానికి ఆమోదం
న్యూఢిల్లీ : ఆకలిని, పోషకాహార లోపాన్ని పాలద్రోలే విషయంలో ధృఢ చిత్తంతో ఉన్నామని జి20 దేశాధినేతలు గొప్పగా ఉద్ఘాటించారు. ఆహారం, ఇంధనం సహా నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజల జీవన ప్రమాణాలపై ఒత్తిడి ఏర్పడుతోందని అంటూ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు, పోషకాహారాన్ని అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముగిసిన జి20 సదస్సులో ఒక డిక్లరేషన్ ఆమోదించారు. పేదరికం, అసమానతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, ఘర్షణలు వంటి పరిణామాలు మహిళలు, చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయని డిక్లరేషన్ అభిప్రాయపడింది.
'ఉక్రెయిన్ యుద్ధం, దాని ప్రభావం కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆహార, ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లింది. సరఫరాలు నిలిచిపోయాయి. ఆర్థిక అస్థిరత ఏర్పడింది. ద్రవ్యోల్బణం పెరిగింది. అభివృద్ధి నిలిచిపోయింది. ఈ పరిణామాలు సభ్య దేశాలలో విధానపరమైన వాతావరణాన్ని సంక్లిష్టం చేశాయి. ముఖ్యంగా కోవిడ్ మిగిల్చిన నష్టాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వర్థమాన, పేద దేశాలపై ఎక్కువగా ప్రభావం పడింది. ఆర్థిక విధ్వంసం అభివృద్ధిని కుంటుపరచింది' అని డిక్లరేషన్ వివరించింది.
రష్యా ఆహార ఉత్పత్తులు, ఎరువులు ప్రపంచ మార్కెట్‌కి చేరడంలో తుర్కియే, ఐరాస మధ్యవర్తిత్వంలో కుదిరిన ఒప్పందాలు చేసిన కృషిని కొనియాడింది. ఉక్రెయిన్ నుండి ఆహారధాన్యాలు సురక్షితంగా రవాణా అయ్యేందుకు కూడా ఈ ఒప్పందాలు ఉపకరించాయని తెలిపింది. రష్యా, ఉక్రెయిన్‌ల నుండి ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలు, ఎరువులు వంటివి పూర్తి స్థాయిలో, సకాలంలో సరఫరా జరగడంతో వర్థమాన దేశాలు, ఆఫ్రికా వంటి పేద దేశాల అవసరాలు తీరాయని వివరించింది.
అందరికీ ఆహార భద్రత, పోషకాహారం అందించేందుకు జి20 సదస్సు ఆరు సూత్రాల కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొనే, పోషకాహారాన్ని అందించే పంటలపై పరిశోధనల్లో సహకారాన్ని మరింత పటిష్టపరచుకోవాలని పిలుపునిచ్చింది. స్థానికంగా ఎరువుల ఉత్పత్తిని పెంచాలని, భూ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని సూచించింది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి ఆహార నష్టాన్ని, వృథాను తగ్గించేందుకు ఆధునీకరణ పద్ధతులు, పెట్టుబడులపై దృష్టి సారించాలని అభిప్రాయపడింది. ఆహార భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో వర్థమాన దేశాలకు చేయూత అందించాలని నిర్ణయించింది. ఆహార, ఇంధన ధరలు గరిష్ట స్థాయి నుండి పడిపోవడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత ఏర్పడిందని జి20 సదస్సు తెలిపింది. ఈ సంవత్సరాంతానికి వ్యవసాయాభివృద్ధి వనరుల కోసం అంతర్జాతీయ నిధిని పరిపుష్టం చేయాలని నిర్ణయించింది.










