Jul 28,2023 22:14

కోహ్లీ ఔట్‌.. సంజూ ఇన్‌! విండీస్‌తో రెండో వన్డే ఆడే భారత జట్టు ఇదే!
వెస్టిండీస్‌తో రెండో వన్డే రేపు
రాత్రి 7.00గం||ల నుంచి
బార్బొడాస్‌: తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా ఇక సిరీస్‌పై గురిపెట్టింది. తొలి వన్డేలో 5వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా వెస్టిండీస్‌తో శనివారం జరిగే రెండో వన్డేలోనూ నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్ని చూస్తోంది. ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో స్పిన్నర్లు కుల్దీప్‌, జడేజా దెబ్బకు విండీస్‌ బ్యాటర్స్‌ చేతులెత్తేశారు. టీమిండియా కాంబినేషన్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు రాహుల్‌ ద్రవిడ్‌కు సవాల్‌గా మారింది. వన్డే ప్రపంచకప్‌ ముందు ఆటగాళ్ల సత్తాకు పరీక్షగా ఈ సిరీస్‌ నిలుస్తోంది. ఈ క్రమంలోనే బెంచ్‌ ఆటగాళ్లకు చోటివ్వాలా? సీనియర్‌ ఆటగాళ్లనే కొనసాగించాలా? అనేది టీమిండియా మేనేజ్‌మెంట్‌ తేల్చుకోలేకపోతోంది. వెటరన్‌ వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌తో పాటు జయదేవ్‌ ఉనాద్కత్‌లను ఆడించాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకుంటే కీలక ఆటగాళ్లను పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. జట్టులో మార్పులు చేయాలని భావిస్తే టీమిండియా మేనేజ్‌మెంట్‌ విరాట్‌ కోహ్లీతో పాటు శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజాలాకు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌.. కనీస పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్‌ లైనప్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది.
మా ఘోర పరాజయానికి కారణం అదే: షారు హోప్‌
పిచ్‌ కండిషన్స్‌కు తగ్గట్లు ఓపికగా బ్యాటింగ్‌ చేయకపోవడమే టీమిండియాతో తొలి వన్డేలో తమ ఘోర పరాజయానికి ప్రధాన కారణమని వెస్టిండీస్‌ కెప్టెన్‌ షారు హోప్‌ అన్నాడు. తొలి వన్డే ఓటమిపై మాట్లాడటానికి ఏమీ లేదని, తమ దృష్టంతా రెండో వన్డేపైనే ఉందని తెలిపాడు. పరుగులు రాబట్టాలంటే కాస్త ఓపికగా బ్యాటింగ్‌ చేయాలని, కానీ తమ బ్యాటింగ్‌లో అదే లోపించిందని చెప్పుకొచ్చాడు.