- రేగిడి ఆమదాలవలసలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం
- బలహీనపడిన అల్పపీడనం
- దక్షిణ ఒరిస్సా, ఉత్తరాంధ్రలో ఉపరితల ఆవర్తనం
ప్రజాశక్తి- యంత్రాంగం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం కుండపోత వర్షాలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరామపురంలో 12.9 సెంటీమీటర్లు, మెళియాపుట్టిలో 9.5, పలాసలో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 8.4 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పార్వతీపురంలో ఏకధాటిగా నాలుగు గంటల పాటు వర్షం కురవడంతో బైపాస్ కాలనీ, సౌందర్య థియేటర్ కాలనీ, నందమూరి కాలనీ, భారతీ నగర్, దేవీనగర్‌తో పాటు పలు కాలనీల్లో భారీగా వర్షం నీరు చేరింది. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీతంపేట ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మక్కువ, వీరఘట్టం మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. వెంగళరాయసాగర్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి సుమారు 600 క్యూసెక్కుల నీటిని గోముఖి నదిలోకి విడుదల చేసినట్లు ప్రాజెక్ట్ ఎఇఇ ప్రశాంత్ తెలిపారు. విజయనగరం జిల్లాలో బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు, గెడ్డలు పొంగి ప్రవహించాయి. స్థానిక పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం గెడ్డ ఉప్పొంగి ప్రవహించింది. ఈ జలపాతాన్ని తిలకించడానికి వచ్చిన పర్యాటకులు వర్షం కారణంగా నిరాశతో వెనుదిరిగారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో భారీ వర్షం కురిసింది. ఎన్‌టిఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 6.9 సెంటీమీటర్లు, చందర్లపాడులో 3.4, వత్సవాయిలో 3.6, నందిగామలో 3.2. పెనుగంచిప్రోలులో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడ నగరంలోనూ భారీ వర్షం కురిసింది. కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ముసునూరులోని రజకులపేట వద్ద డ్రెయినేజీ పూడుకుపోవడంతో వర్షపు నీరు, మురుగునీరు ఇళ్లల్లోకి చేరింది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముదినేపల్లిలో ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పలు గ్రామాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురవడంతో పలు రహదారులతోపాటు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా జల్లులు పడ్డాయి.
బుధవారం నాటికి అల్పపీడన ప్రాంతం బలహీనపడినప్పటికీ అదే ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రుతుపవన ద్రోణి రాయపూర్, మన్నాలా, బికనీర్, కళింగపట్నం నుంచి ఆగేయ దిశగా వాయువ్య పరిసర ప్రాంతాలు అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపారు. ఉత్తర కోస్తాలో కూడా రాగల 24 గంటల్లో రెండు మూడు చోట్ల భారీగా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.










