అరియలూర్ (తమిళనాడు) : టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందిన దుర్ఘటన తమిళనాడులోని అరియలూర్ జిల్లా వెరియూరు గ్రామంలో జరిగింది. పేలుడు సంభవించిన సమయంలో కార్మికులు పరిశ్రమ లోపలే పని చేస్తున్నారు. వారిలో 25 మంది మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఓ మహిళతో కలిపి మొత్తం ఐదుగురు మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ భారీ పేలుడు కారణంగా పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు సంభవించడానికి గల కారణాలు పూర్తిగా తెలియలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










