Oct 10,2023 08:17

కేంద్ర ప్రభుత్వం, కెఆర్‌ఎంబిలకు నోటీసులు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కృష్ణా నదీ నీటి వినియోగం, విద్యుదుత్పత్తి కి సంబంధించి వారం రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం,
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి)లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రిజాయిండర్‌ దాఖలుకు ఎపి ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇచ్చింది. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ, 2021లో ఎపి ప్రభుత్వం సర్వోన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది.ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. అయితే ఈ పిటిషన్‌కు సంబంధించి ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేసినట్లు తెలంగాణ తరపున సీనియర్‌ న్యాయవాది సిఎస్‌ వైద్యనాథన్‌ కోర్టుకు నివేదించారు. ఇదే అంశంపై కేంద్రం తరపున న్యాయవాది స్పందిస్తూ, వారం రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేస్తామని, ఇందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొన్న ద్విసభ్య ధర్మాసనం ఏడు రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి, కెఆర్‌ఎంబికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 21కి వాయిదా వేసింది.