ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌పై మోడీ సర్కారు కుట్రలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.రామకృష్ణ తెలిపారు. ప్లాంట్‌ను పరిరక్షించుకునేంత వరకూ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1002వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్ ఎస్‌ఎంఎస్ - 1 కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను గుజరాత్ పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు, కార్మికుల కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ కార్మికులు సుబ్బయ్య, వి.సత్యనారాయణ, బాబు రంగ ప్రసాద్, రమణమూర్తి, డి.సురేష్, ఎంవి.రమణ, సాహూ, కటారి రామకృష్ణ పాల్గొన్నారు.










