ప్రజాశక్తి- వంగర : తోటపల్లి కుడి కాలువ ఆయకట్టుకు శివారున ఉన్న విజయనగరం జిల్లా వంగర మండలంలోని భూములకు సాగునీరు అందించాలని రైతులు ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన కార్యక్రమానికి మద్దతు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ..తోటపల్లి ప్రాజెక్టు కుడి కాలువ ఆయకట్టుకు వంగర మండలంలోని శివారు భూములకు సాగునీరు అందక ప్రతిఏడాది రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. మండలంలోని కొత్తవలస, మద్దివలస, ఎం.సీతారాంపురం, వంగర, శివ్వాం, తలగాం, చిన రాజుల గుమ్మడ తదితర గ్రామాల్లో ప్రస్తుతం వెన్ను దశలో ఉన్న వరి పంట సాగునీరు లేక ఎండిపోతోందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని సాగునీరు అందించాలని కోరారు. లేకపోతే రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు మాట్లాడుతూ.. పంట చివరి దశలో సాగునీరు లేక వరి పంట ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనంతరం తహశీల్దార్ డి. ఐజాక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామ్మూర్తి నాయుడు, పలువురు రైతులు పాల్గొన్నారు.










