అమృతసర్ : ఇటీవల సంభవించిన వరదల నష్టాల నుండి బయటపడవేసే ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించాలని, రుణాలను రద్దు చేయాలని కోరుతూ మూడు రోజుల పాటు రైల్ రోకో ఆందోళనకు పంజాబ్ రైతాంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు గురువారం పట్టాలపై బైఠాయించారు. 30వ తేదీ వరకు ఈ ఆందోళనలు కొనసాగుతాయి. మొగా, హౌషియార్‌పూర్, గురుదాస్‌పూర్, జలంథర్, తరన్ తరన్, సంగ్రూర్, పాటియాలా, ఫిరోజ్‌పూర్, భటిండా, అమృత్‌సర్‌ల్లో రైతులు ఆందోళనలు నిర్వహించనున్నారు. అమృతసర్‌లో అమృతసర్-ఢిల్లీ రైల్వే ట్రాక్‌పై రైతులు బైఠాయించారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ, భారతి కిసాన్ యూనియన్ (క్రాంతికరి), బికెయు(ఏక్తా అజాద్), అజాద్ కిసాన్ కమిటీ దోబా, బికెయు(బెహ్రమ్‌కె), బికెయు(షహీద్ భగత్‌సింగ్), బికెయు(ఛోటూ రామ్)లు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. ఉత్తర భారత రాష్ట్రాలకు రూ.50వేల కోట్ల వరద సహాయక ప్యాకేజీ ఇవ్వాలని రైతు నేత గురుబచన్ సింగ్ డిమాండ్ చేశారు. రైతాంగం, రైతు కూలీల రుణాలను మొత్తంగా రద్దు చేయాలని కోరారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ జరిగిన ఆందోళనలో మరణించిన రైతు కుటుంబానికి 10లక్షల నష్టపరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.










