ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : జులైలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలో నష్ట పోయిన రైతులందరిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్, రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు సోమవారం కలెక్టర్ పి.రాజా బాబుని కలసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎపి రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావులు మాట్లాడుతూ.. గత నెలలో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు నీట మునిగి దెబ్బతిన్న వరి పొలాలకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు మాత్రమే ఇస్తున్నారని, ఈ సార్వా సీజన్లో ఎక్కువ శాతం రైతులు, కౌలు రైతులు రెండుసార్లు ఎద రూపంలో, నాట్లు నాట్లు వేసుకోవడం జరిగిందని. మరలా భారీ వర్షాలకు ముంపునకు గురై పంటలు దెబ్బ తిన్నాయన్నారు. ఇప్పటివరకు ఒక ఎకరానికి సుమారు పది నుండి, 12 వేల వరకు ఖర్చు రైతులు ఖర్చు పెట్టుకున్నారని కావున ప్రభుత్వం ఎన్యుమిరెషన్ చేసి విత్తనాలతో పాటు,ఆ ఖర్చులను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 2022 సార్వా సీజన్ తాలూకు రవాణా ఖర్చులు ఇప్పటివరకు ఇవ్వలేదని.హమాలీ ఖర్చులు మాత్రం ఇచ్చారన్నారు. సంబంధిత రవాణా ఖర్చులు రైతుల ఖాతాలలో జమ చేయవలసినదిగా కోరారు. అలాగే గతంలో 2020 ఏప్రిల్ లో కురిసిన భారీ వర్షాలు, వడగండ్ల వానకు బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో దాదాపు 4,524 మంది రైతులకు సుమారు మూడు కోట్ల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిందని. కానీ ఈరోజు వరకు రైతులకు ఇవ్వలేదన్నారు. అధికారులు ఆ మొత్తం సిఎఫ్‌ఎంఎస్‌లో ఉందని గత రెండు సంవత్సరాల నుండి చెబుతున్నరన్నారు. అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసిన రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. వేంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల బసవయ్య, ఈడే రామారావులు పాల్గొన్నారు.










