కళ్యాణదుర్గం (అనంతపురం) : ఎలుగుబంటి దాడిలో రైతుకి తీవ్రగాయాలైన ఘటన మంగళవారం అనంతపురంలో జరిగింది. కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామ శివారులో రైతు యల్లప్ప పొలం పనులకు వెళుతుండగా, యల్లప్పపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ దాడిని చూసిన గ్రామస్తులు కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడి నుండి అడవిలోకి పరుగులు తీసింది. రైతు యల్లప్ప పొట్ట భాగంలో తీవ్రగాయాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు 108 లో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలుగుబంటి దాడుల నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.










