Oct 28,2023 08:03

ప్రజాశక్తి - కొత్తపల్లి:అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. నందికుంట గ్రామానికి చెందిన రైతు అబ్దుల్‌ రజాక్‌ (38) తనకున్న మూడెకరాల సొంత పొలంతో పాటు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పలు పంటలు సాగు చేసేవారు. సాగు నిమిత్తం సుమారు రూ ఆరు లక్షలు అప్పు చేశారు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు చేతికందకపోవడంతో వడ్డీల భారం అధికమైంది. రుణదాతల ఒత్తిళ్లు తాళలేక గురువారం రాత్రి పొలం వద్దే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండేళ్ల కాల వ్యవధిలో ఈ గ్రామంలో దాదాపు నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.