- సతారా హింసకు కొద్ది వారాల ముందు హ్యాకర్ల దుశ్చర్య
- హ్యాక్ అయిందని ఫిర్యాదు చేసినా మైనర్‌పై కేసు
సతారా (మహారాష్ట్ర) : నెల రోజుల్లోనే దిల్షాద్ షేక్ జీవితం తలకిందులై పోయింది. సతారాలో అద్దెకు ఉంటున్న వారి కుటుంబాన్ని విద్వేష మూకలు బలవంతంగా బయటకు నెట్టేశాయి. ఆ కుటుంబాన్ని దేశద్రోహులు అని ముద్ర వేసి హింసించాయి. దిల్షాద్ 14ఏళ్ల కొడుకు పేరుతో తప్పుడు పోస్ట్‌ను పెట్టి, దానిని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాయి. ఆ పై దాడులకు దిగాయి. సతారాలో హింసను సృష్టించేందుకు విద్వేష మూకలు పకడ్బందీగా పన్నిన కుట్రలో భాగమే ఇదంతా. సతారాలోని పుసేసవాలిలో వాహనాలకు నిప్పంటించడం, ఆస్తుల ధ్వంసం చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి మరో మూడు కుటుంబాలను అందులో ఇరికించేందుకు యత్నించడం వంటి ఆగడాలకు కూడా ఈ మూకలు పాల్పడ్డాయి.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, 35ఏళ్ల దిల్షాద్ షేక్ అక్రిడేటెడ్ సామాజిక ఆరోగ్య కార్యకర్త. ఆగస్టు 15న ఉదయం ఆమె స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరవడానికి వెళ్ళాల్సి వుంది. ఈలోగా ఆమె పక్క ఇంటి వ్యక్తి పరుగుపరుగున వచ్చి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న ఓ పోస్టును చూపించాడు. అందులో 17వ శతాబ్దికి చెందిన మరాఠా పాలకుడు శివాజీని అవమానిస్తూ కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. తన కుమారుడి పేరుతో ఎవరో ఉద్దేశపూర్వకంగానే దీనిని పెట్టారని, ఆ భాష చూస్తే అది తన కొడుకు రాసింది కాదని షేక్ మీడియాకు తెలియజేసింది.
బంధువు ఇచ్చిన సలహా మేరకు ఆమె తన కొడుకును తీసుకుని సతారాలోని సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్లి ఫేక్ పోస్టింగ్‌పై ఫిర్యాదు చేశారు. తమ కుటుంబం వాడే రెండు సెల్‌ఫోన్లను ఆమె అక్కడ అధికారులకు ఇచ్చి వచ్చారు.
కొన్ని గంటల వ్యవధిలోనే, ఆ పోస్టు స్క్రీన్‌షాట్‌లు వైరల్ అయిపోయాయి. దాదాపు 40మంది గుంపు ఆమె ఇంటివద్దకు వచ్చి రాళ్లు వేయడం ప్రారంభించింది. ఆమె అత్తగారు, 11 ఏళ్ల కూతురు భయంతో ఇంట్లో దాక్కోవాల్సి వచ్చింది. వారు మమ్మల్ని దేశద్రోహులుగా పిలుస్తూ, పాకిస్తాన్ వెళ్లిపోవాల్సిందిగా కేకలు వేశారని షేక్ ఆవేదన వ్యక్తం చేసింది. సైబర్ పోలీసులు ఆ పోస్టును తొలగించిన కొన్ని సెకన్ల వ్యవధిలోనే మళ్లీ ప్రత్యక్షమైంది. పోలీసులు కూడా దాన్ని చూశారు. కాబట్టి ఆ ఖాతా హ్యాక్ అయిందనేది స్పష్టం. అయినప్పటికీ ఆమె మైనర్ కొడుకుపై కేసు నమోదు చేశారు. మత భావాలను రెచ్చగొడుతున్నారంటూ ఐపిసి 295 (ఎ) సెక్షన్ కింద కేసు పెట్టారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ఆగస్టు 16న కొద్ది రోజుల పాటు జ్యువెనైల్ హోమ్‌కు పంపారు. అక్కడితో ఆ కుటుంబం కష్టాలు తీరిపోలేదు.
వారు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఆదేశించాడు. తామేమీ తప్పు చేయలేదని చెప్పినా ఆయన వినలేదన్నారు. తన భర్త కూడా ఇంట్లో లేరని కుటుంబ ఫంక్షన్ నిమిత్తం కర్ణాటక వెళ్లారని ఆమె తెలిపారు. ఇంకా ఆ ఇంట్లోనే వుంటే ఏమైనా చేస్తామంటూ స్థానిక రాజకీయ నేత ఒకరు హెచ్చరించారని చెప్పారు. కట్టుకున్న బట్టలతో ఇల్లు వీడి రావాల్సి వచ్చిందన్నారు. తాము ముస్లింలైనందుకే ఇదంతా జరిగిందని ఆమె వాపోయారు. కొద్ది రోజుల పాటు ఆ పక్కనే గల గ్రామంలో ఆ కుటుంబం తల దాచుకుంది. ఆమె భర్త రాజా షేక్ 19వ తేదీన ఇంటికి చేరుకోగానే ఆయన్ని కూడా అరెస్టు చేశారు.










