Aug 13,2023 14:57

చంద్రయాన్‌-3 ప్రయోగంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో. ఇప్పుడు ఆదిత్య ఎల్‌ 1 అనే పాజెక్టుతో సూర్యుడి మీద పరిశోధనలు చేయడానికి సిద్ధమైంది. సూర్యుడి మీద సాధ్యమా అంటే.. సాధ్యమేనంటున్నారు మన ఖగోళ శాస్త్రవేత్తలు. విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోవడానికి నక్షత్రాలు ప్రధాన ఆధారం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం సూర్యుడు. అందుకే సూర్యుడిలో ఉత్పన్నమయ్యే మార్పులను గుర్తించడానికి, విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

భూమికి 15 కోట్ల కి.మీ. దూరంలో ఉన్న సూర్యుని వయసు 450 కోట్ల సంవత్సరాలు. సూర్యుడిలో నిరంతరం కేంద్రక సంలీన చర్య జరుగుతూ ఉంటుంది. అప్పుడు హైడ్రోజన్‌ హీలియంగా మారి అధిక శక్తి విడుదలవుతుంది. సూర్యుడి కేంద్రాన్ని కోర్‌ అని, ఉపరితలాన్ని క్రోమోస్పియర్‌ అని అంటారు. కోర్‌ నుంచి క్రోమోస్పియర్‌కి వచ్చే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కోర్‌లో కోటి యాభై లక్షలు, క్రోమోస్పియర్‌ మీద 5500 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది.

సౌర తుపానులా..!

అవును. సూర్యుడిపై కొన్ని ప్రదేశాల్లో కేంద్రక సంలీన చర్యల తీవ్రత వల్ల ఒక్కసారిగా పేలుళ్లు జరిగి.. సౌర తుపానులు ఏర్పడతాయి. భూ అయస్కాంత క్షేత్రాల వల్ల ఇవి నేరుగా భూమిని చేరలేవు. కానీ శాటిలైట్లకు, వ్యోమగాములకూ, భూమ్మీద ఉండే కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు, విద్యుత్‌ గ్రిడ్‌లకు వీటివల్ల ప్రమాదం ఉంటుంది. ఆదిత్య ఎల్‌ 1 వాటిని ముందుగానే గుర్తిస్తుంది.

దిత్య ఎల్‌1 అంటే..

సూర్యుడి మీద ప్రయోగాలు చేయడానికి ఉద్దేశించిన మిషన్‌ ఆదిత్య ఎల్‌ 1. ఆగస్ట్‌ 26న బయలుదేరి నాలుగు నెలలకు దాని నిర్దిష్ట కక్ష్యను చేరుతుంది. అంటే సూర్యుడికి, భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్‌ పాయింట్‌గా పిలువబడే శూన్య ప్రదేశంలోకి ప్రవేశిస్తుంది.

లెగ్రాంజ్‌ పాయింట్‌ అంటే..

అంతరిక్షంలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్లు ఉంటాయని మనకు తెలుసు. వీటిలో ప్రతి రెండు ఖగోళాల మధ్య గురుత్వాకర్షణ శూన్యంగా ఉండే ప్రదేశాలు ఐదు ఉంటాయి. వాటినే లెగ్రాంజ్‌ పాయింట్స్‌ అంటారు. భూమికి, సూర్యుడికి మధ్య ఉండే ఈ ఐదు పాయింట్లలో మొదటిదైన ఎల్‌ 1 నుంచి పరిశోధన జరుగుతుంది.

ఎలా గుర్తించాలి..?

సూర్యుడికి, భూమికి మధ్యనున్న ఐదు శూన్య ప్రదేశాలలో.. లెగ్రాంజ్‌ పాయింట్‌-1 ఎల్‌ 1 సూర్యుని నుంచి భూమికి పదో వంతు దూరంలో ఉంటుంది. అంతే దూరంలో భూమికి వెనుక వైపు ఎల్‌ 2, సూర్యుడికి అవతలి వైపు ఎల్‌ 3 ఉంటాయి. రెండు ఖగోళాలకు మధ్య నుంచి బయటి వైపుగా ఎల్‌ 4, ఎల్‌ 5 లుంటాయి. ఎల్‌ 1 శూన్య కక్ష్యలోకి ఆదిత్యని ప్రవేశ పెట్టబోతున్నారు.

ఇవే కీలకమా..

విశ్వంలోని ప్రతి ఖగోళ వస్తువుకు ఉండే గురుత్వాకర్షణ శక్తి, దాని ద్రవ్యరాశిపై ఆధారపడుతుంది. సౌర కుటుంబంలో ఒక్క సూర్యుడి ద్రవ్యరాశే 99.86 శాతం ఉంది. మిగిలిన గ్రహాలు, ఉపగ్రహాలన్నింటి ద్రవ్యరాశి 0.14 శాతం ఉంటుంది. భూమి కన్నా సూర్యుడి ద్రవ్యరాశి 27.9 రెట్లు ఎక్కువ ఉంటుంది. రాకెట్‌ సూర్యుడి ద్రవ్యరాశి పరిధిని దాటి వెళ్లాలంటే.. సెకనుకి 615 కి.మీ. వేగంతో పైకి వెళ్లాలి. రెండు గురుత్వాకర్షణ శక్తులను బ్యాలెన్స్‌ చేసేలా ఆదిత్య ఎల్‌1 ను ప్రవేశపెట్టి, సూర్యుడి మీద పరిశోధనలు చేస్తున్నారు.

ఎల్‌1 నుంచే ఎందుకు?

ఎల్‌ 1 భూమికి, సూర్యుడికి మధ్యనున్న దూరంలో భూమి వైపుగా పదోవంతు దూరంలో ఉంటుంది. అంటే సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మిగిలినవి దూరం విషయంలో గానీ, పొజిషన్‌ విషయంలో గానీ పరిశోధనకు అనుకూలంగా లేవు. అందుకే ఎల్‌ 1ను ఎంచుకోవలసి వచ్చింది.

కరోనా అంటే..!

సూర్యుడి చుట్టూ ఆవరించిన ప్రదేశాన్ని కరోనా అంటారు. దీని గురించి పరిశోధనలు చేయాలంటే.. భూ వాతావరణానికి అవతల ఉండి సూర్యుడ్ని నేరుగా చూడగలగాలి. భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న ఎల్‌ 1 దగ్గర నుంచి ప్రయోగించే అబ్జర్వేటరీలు నిరంతరం సూర్యుడ్ని పర్యవేక్షిస్తాయి. సౌర తుపానులను ముందుగానే గుర్తించగలుగుతాయి.

ఎలా..?

కరోనాను పరిశీలించడానికి ఆదిత్య ఎల్‌1లో ఏడు రకాల పరికరాలు ఉన్నాయి. వాటిలో నాలుగు పరికరాలు సూర్యుడి గురించి, మూడు ఎల్‌ 1 చుట్టూ ఉన్న పరిస్థితులను విశ్లేషించి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతాయి. ఇవి ప్రధానంగా కరోనా ఉష్ణోగ్రత, సూర్యుని వేడి, పరిధి, ప్లాస్మా, జ్వాలలు, అయస్కాంత క్షేత్ర ప్రభావం, సౌర పవనాల పుట్టుక, వాటి గమన స్థితిగతుల్ని విశ్లేషించి ఆ డేటాను ఇస్రోకు పంపిస్తాయి.
మరి మనమూ వేచి చూద్దాం.. మన ఆదిత్య అందించే వివరాలేమిటో తెలుసుకుందాం..!