Aug 06,2023 15:12

ప్రజాశక్తి-కర్నూలుస్పోర్ట్స్‌ : ప్రాధమిక దశ నుండే పిల్లలు క్రీడల్లో పాల్గనడం వల్ల క్రమశిక్షణ, ఏకాగ్రత పెరిగి చదువులోనూ రాణింస్తరని ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ శంకర్‌ శర్మ అన్నారు. నగరంలోని పెద్ద మార్కెట్‌ సమీపంలోని మున్సిపల్‌ పార్కులో ఏర్పాటు చేసిన తైక్వాండో ప్రదర్శనలో చిన్నారులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డా. శంకర్‌ శర్మ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రీడల్లో చదువులో రాణించాలంటే మెరుగైన ఆరోగ్యం ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఇంటిలో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే తినాలని సూచించారు. అలాగే కలుషితమైన నీరు తాగడం వల్ల కలరా, గ్యాస్ట్రోఎంట్రైటీస్‌, డయేరియా, టైఫాయిడ్‌ ,హెపటైటిస్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సూచించారు. విద్యార్థులు ఇంటి నుండి స్వచ్ఛమైన మంచినీరు తీసుకునేందుకు వీలుగా వాటర్‌ బాటిల్లను అందజేసినట్లు వివరించారు. విద్యార్థులు మార్షల్‌ ఆర్ట్స్‌లో సాధన చేయడం వల్ల ఫిజికల్‌ ఫిట్నెస్‌ పెరుగుతుందని, యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే వ్యయామం చేయాలని ప్రస్తుతం విద్యార్థులు చిన్నతనంలో సెల్‌ఫోన్‌లను అతిగా వినియోగించడం వల్ల ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు. అలా కాకుండా క్రీడల్లో పాల్గనడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య మెరుగుపడి చదువులో రాణిస్తారని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను క్రీడల్లో పాల్గనేలా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల్లో పాల్గనడం వల్ల విబేధాలు లేకుండా స్నేహభావంతో మెలిగి క్రీడాస్పూర్తిని ప్రదర్శిస్తారని చెప్పారు. దేశ భవిష్యత్తు నేటి చిన్నారుల చేతుల్లోనే ఉందన్నారు. వారు క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గనాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు చిన్నతనం నుంచే తామంతా భారతీయులం అన్న జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్షల్‌ ఆర్ట్స్‌ మాస్టర్‌ వెంకటేశ్వర్లు రోహిత్‌, నాగరాజు, ఊర్మిళ తదితరులు పాల్గన్నారు.