న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని ఎయిమ్స్ పరిశోధన ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తల పదవీకాలాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆరేళ్లపాటు పరిమితి విధించింది. ఈ కాల పరిమితిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైం రమేష్... నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ట్వీట్ చేశారు. 'దశాబ్దాలుగా నిర్మించిన ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థను మోడీ ప్రభుత్వం మోక్రోమేనేజ్ చేయడానికి, చివరికి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిందనడానికి ఇది మరో ఉదాహరణ' అని రమేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు జతగా శాస్త్రవేత్తల కాలపరిమితికి సంబంధించిన మీడియా నివేదికను కూడా ఆయన ట్యాగ్ చేశారు. అలాగే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంటరీ స్టాడింగ్ కమిటీ సభ్యునిగా నేను ఉన్నప్పుడు 2015 ఆగస్టులో 'ఎయిమ్స్ స్వయంప్రతిపత్తి, పరిశోధనా సామర్థ్యం, సామర్థ్యాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో దాని పనితీరుకు సంబంధించిన నివేదికను స్టాడింగ్ కమిటీ సమర్పించింది. అయితే ఇప్పుడు దానికిబదులుగా.. సైన్స్ అంటే ఏమిటో తెలియనివారు, రీసెర్చ్ ఎలా జరుగుతుందో అర్థంకానివారు ఆదేశాలు జారీ చేస్తున్నారు' అని రమేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, మోడీ ప్రభుత్వం విధించిన ఈ కాలపరిమితికి సంబంధించిన ప్రతిపాదనను ఎయిమ్స్ పరిశోధనా శాస్త్రవేత్తలు ఈ నెల ప్రారంభంలోనే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.










