Sep 21,2023 16:29
  •  పేరూరు రిలే దీక్షల్లో మాజీ మంత్రి పరిటాల సునీత హెచ్చరికలు
  • అసెంబ్లీలో బాలకృఈష్ణపై అంబటి చేసిన వ్యాఖ్యల మీద ఆగ్రహం

ప్రజాశక్తి- రాప్తాడు (అనంతపురం) : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత వైసిపి నాయకుల వెన్నులో వణుకు మొదలైందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రామగిరి మండలం పేరూరులో రాప్తాడు నియోజకవర్గ తెలుగు మహిళల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కూడా ఈ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మహిళలతో కలిసి పేరూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలతో హౌరెత్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబును అనవసరంగా అరెస్టు చేయించామన్న భయం వైసిపి నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా సీఎం జగన్‌ కు ఏకంగా జ్వరం వచ్చిందని కామెంట్‌ చేశారు. స్కిల్‌ డెవలప్మెంట్‌ ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ పరిటాల సునీత ప్రశ్నించారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నవారు చంద్రబాబు వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామంటూ సంఘీభావ నిరసనలు చేస్తుండటం ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబుపై ఏం కేసు పెట్టాలో తెలియక చివరకు స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాం అంటూ అరెస్టులు చేశారన్నారు. సీఐడీ అధికారులు వాస్తవాలు పట్టించుకోకుండా సీఎం జగన్‌ రెడ్డి చెప్పినట్టుగా కేసులు పెడుతున్నారన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నంత మాత్రాన మేము ఎక్కడ భయపడేది లేదని సునీత స్పష్టం చేశారు. అసలు ఈ జైలు గోడలు తమను ఆపలేవన్నారు. 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును జైలులో హింసలకు గురి చేస్తున్నారన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు తన శాఖ గురించి తప్ప ప్రతిపక్షాలను తిట్టడానికి పరిమితమయ్యారని విమర్శించారు. బాలయ్య గురించి నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. మరోవైపు వైసీపీ నాయకులు చేసిన దందాలు, అక్రమాల గురించి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుగుతుందని సీఎం జగన్‌ సహా ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి పేరూరు జలాశయానికి నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికారని.. కానీ ఆయన చేసింది ఏమి లేదని సునీత అన్నారు. తాము గతంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను రద్దు చేసి ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఎమ్మెల్యే సోదరులు చేసిన అక్రమాలపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందన్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన కచ్చితంగా బయటకు వస్తారని అప్పటివరకు మన పోరాటం ఆప కూడదని పరిటాల సునీత సూచించారు.