- సవాళ్లను అధిగమించే నీటిపారుదల విధానం అవసరం
- ఐసిఐడి సమావేశంలో సిఎం జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి షెకావత్
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో:రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, నీటి కొరతతో వ్యవసాయరంగం కరువు పరిస్థితులు చవిచూస్తోందని, దీన్ని అధిగమించేలా సరైన నీటి పారుదల నిర్వహణ విధానం ఎంతైనా అవసరముందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖ బీచ్ రోడ్డులోని రాడిషన్ బ్లూ హోటల్‌లో 25వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ కాంగ్రెస్ (ఐసిఐడి) సదస్సును గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ఐసిఐడి, 74వ అంతర్జాతీయ కార్యనిర్వహక కమిటీ (ఐఇసి) సమావేశాలను ఈ నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు విశాఖలో నిర్వహించేందుకు కేంద్రం అంగీకరించడం శుభపరిణామమన్నారు. సుస్థిర వ్యవసాయ నీటి నిర్వహణ అనే విస్తారమైన లక్ష్యానికి అనుగుణంగా ఐసిఐడిని స్థాపించారని గుర్తుచేశారు. ఎపిలో 40 ప్రధాన మధ్యతరహా, చిన్న నదులున్నాయని, వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో శతాబ్దాలుగా రాష్ట్రం గొప్ప వారసత్వాన్ని కలిగి ఉందని అన్నారు. ఎపి పెద్ద తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నప్పటికీ రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పశ్చిమ ప్రాంతాలు తక్కువ వర్షపాతం కారణంగా తరచూ కరువు బారిన పడుతున్నాయని వివరించారు. ఇది ఆయా ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అన్నింటికన్నా దిగువ నదీ తీర రాష్ట్రంగా ఉన్నందున వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా వంటి ప్రధాన అంతరాష్ట్ర నదీ పరివాహక ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు నీటికొరత సమస్య ఎదురవుతోందని చెప్పారు. వర్షపాతం అధికంగా ఉండే జూన్ నుంచి సెప్టెంబర్ మాసాల్లో నీటిని ఒక బేసిన్ నుంచి మరో బేసిన్‌కు తరలించడం ద్వారానే నీటి కొరతను అధిగమించగలుగుతామన్నారు. నీటి నిర్వహణకు సంబంధించిన అన్ని సమస్యలనూ ఐసిఐడి సమగ్రంగా అధ్యయనం చేసి సాంకేతికంగా సాధ్యమయ్యే, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజిక ఆమోదయోగ్యమైన పర్యావరణ అనుకూల పరిష్కారాలను చూపుతుందని తాను నమ్ముతున్నానన్నారు.
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. జలశక్తి మంత్రిత్వ శాఖ 2024 నాటికి 140 బిలియన్ యుఎస్ డాలర్లను నీటి, శానిటేషన్ రంగంలో సాధించాలన్న లక్ష్యాన్ని మోడీ సూచించారన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో సుస్థిర ఎగుమతిదారుగా భారత్ ఎదిగిందన్నారు. దేశం ఇరిగేషన్‌లో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఐసిఐడి అధ్యక్షులు డాక్టర్ రగాబ్, ఉపాధ్యక్షులు కుష్వేందర్ ఓహ్రా, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.










