ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ (కృష్ణా) : మచిలీపట్నం మండలం చిన్నాపురం గ్రామ పొలంలో ఆదివారం ఏరువాక కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ తో కలసి పొలంలో దుక్కి దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలుగుదేశంతోనే సాధ్యం అన్నారు. రైతుల సుభిక్షతే నా లక్ష్యం అంటూ రైతు కోసం అహర్నిశలు తపించే నారా చంద్రబాబు నాయుడు త్వరలో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులకు రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించనున్నారన్నారు. ఇప్పటికే మహానాడులో రైతులకు ఆర్థికపరమైన భరోసాను ఏడాదికి 20 వేల రూపాయలు పెట్టుబడి రూపంలో ఇవ్వడం జరుగుతుందని ప్రకటించారు. రాబోయే దసరాకు పూర్తిస్థాయిలో రైతు మేనిఫెస్టో ప్రకటించి రైతులకు రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించబోతున్నారు. రాబోయేది రైతుల ప్రభుత్వం అన్నారు. రైతు ప్రభుత్వంలో ఈ భరోసా కేంద్రాల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితులు, ధాన్యంతోలి రావాల్సిన డబ్బులు కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూసే అవసరం ఉండదని, అప్పులు చేసి, వడ్డీలకు తీసుకొని, మహిళల పుస్తెలు తాకట్టు పెట్టి చివరకు వాటిని తీర్చలేక మానసిక బాధతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉండవన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ క్రాఫ్ బుకింగ్ చేసుకోవాలని లేకపోతే రైతులకు ఎటువంటి బెనిఫిట్స్ అందవు అని చెబుతున్నారు. కానీ దాని మీద అవగాహన కల్పించక పోవడంతో రైతు భరోసా కేంద్రాల చుట్టూ రైతులు తిరిగి ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం సేకరించిన 48 గంటలలో రైతులకు బకాయిలు చెల్లించడం జరిగింది అన్నారు. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆ పరిస్థితి లేదు అన్నారు. కొనకళ్ల నారాయణ రావు మాట్లాడుతూ రైతులే దేశానికి వెన్నెముక అని తెలుగునాట ఏరువాక పున్నమి వ్యవసాయదారులకు ఎంతో ప్రీతికరమైన రోజు అన్నారు.ఏరువాక పున్నమి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులందరూ ఈ పండుగను జరుపుకుంటారని, 'ఏరు' అంటే ఎడ్లను కట్టి దున్నడానికి సిద్ధపరచిన నాగలి, 'ఏరువాక' అంటే దుక్కి ప్రారంభ దినం అని, అన్నారు.రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూడా ఈ వైసీపీ ప్రభుత్వం విఫలం అయింది అన్నారు.బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ అన్నదాతలు ఈ ఏరువాక పూర్ణిమ పర్వదినాన ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లను పూలు, పసుపు, కుంకుమ, ధూప దీపాలు మొదలైనవాటితో పూజించి, దుక్కి దున్నడం తో ప్రారంభమైన వ్యవసాయ పనులు, ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పంటలు పండాలని భగవంతుని కోరుకుంటు, ఈ ఏరువాక పౌర్ణమి రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏరువాక పూర్ణిమ పర్వదినాన్ని ఎంతో గొప్పగా జరిపేవారమని, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అబద్ధపు మాటలతో మోసగించటం సరిపోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ, మాజీ ఎం.పి.పి. కాగిత వెంకటేశ్వర రావు, మాజీ జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, సర్పంచ్ గోపాలరావు, క్లస్టర్ ఇంఛార్జి లంకే శేషగిరి రావు, తలారి సోమ శేఖర్, వక్కపట్ల శ్రీనివాస్, గుమ్మడి విద్యాసాగర్, కార్పొరేటర్ దేవరపల్లి అనిత, మహిళా అధ్యక్షురాలు లంకి శెట్టి నీరజ, కరెడ్ల సుశీల, నాగ రమేష్, రాజులపాటి సత్యనారాయణ, లుక్కా సాయిరాం, గౌడ్ బసయ్య, శెట్టి రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.










