ఈ అనంత విశ్వంలో జీవవైవిధ్యానికి, పర్యావరణానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటిలో ఏది గతి తప్పినా విశ్వంలో జీవి మనుగడే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి. విశ్వంలో ఏకకణ జీవి నుండి పరిణామ క్రమంలో మానవుని పుట్టుక ఉద్భవించింది. అయితే మెదడు సంకేతాలతో మిగిలిన జీవ జాతుల కంటే మాటల ద్వారా భావాన్ని వ్యక్తం చేసే విభిన్నమైన లక్షణం మనిషికి మాత్రమే ఉంది. ఇదే మిగతా జీవులపై ఆధిపత్యాన్ని తెచ్చిపెట్టింది. తద్వారా విజ్ఞానాభివృద్ధికి, మానవాభివృద్ధికి తోడ్పడింది. అయితే మానవుని విపరీత చర్యల కారణంగా పర్యావరణ మనుగడకు ప్రమాదం ఏర్పడుతోంది. ఫలితంగా ప్రకృతిలో సంభవించే మార్పులు అనేక విపత్తులకు దారితీస్తున్నాయి. ఈ మార్పుల కారణంగా అనేక జీవజాతులు అంతరించిపోయాయి. భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటికి 7.5 నుంచి 13 శాతం జీవ జాతి అంతరించి (విలుప్తమై) పోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితిని నివారించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూమి ఏర్పడిన తర్వాత ఇప్పటికి ఐదు విడతల సామూహిక జంతు జాతులు అంతరించి పోయాయి. ప్రస్తుతం ఆరో దశకి మధ్య స్థితిలో ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1950 నుండి ఇప్పటికి దాదాపు 100 జంతు, వృక్ష జాతులు వేట, కాలుష్యం, అటవీ నిర్మూలన వంటి చర్యలతో కనుమరుగయ్యాయి. భవిష్యత్తులో ఈ చర్యలను అడ్డుకోకపోతే మరింత నష్టం చవిచూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రకృతి పరంగా సహజంగానే కొన్ని అంతరించిపోతాయి. అయితే ప్రస్తుత దశకి కారణం ఇష్టానుసారంగా అపరిమితమైన సహజ వనరుల వినియోగమే అనేది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అడవులు కొట్టేయడం, అవసరానికి మించిన ఆహారోత్పత్తి (ఆహారేతర వాణిజ్య పంటలు) అలాగే వాయు, జల, గనుల దుర్వినియోగం, తద్వారా వచ్చే కాలుష్యాలు ప్రమాద హేతువులుగా మారుతున్నాయనేది సుస్పష్టం.

జీవ పునరుద్ధరణ అవసరం..
ఇప్పటికైనా జీవ పరిరక్షణా చర్యలు, పునరుద్ధరణ చేపడితే కొన్ని దశాబ్దాలకైనా పర్యావరణంలో సమతుల్యత ఏర్పడే అవకాశాలున్నాయి. లేదంటే ప్రమాదపుటంచుల్లో ఉన్న అనేక జీవజాతులు అతి తక్కువ కాలంలోనే పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభం కేవలం జంతువులకు మాత్రమే పరిమితం కాదనేది మనం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా మానవుని జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిణామ క్రమంలో జంతుజాతులు క్షీణించడం సహజం. కానీ ప్రస్తుత పరిస్థితి కేవలం మానవ తప్పిదాల వల్లనే 1000 నుండి 10,000 జాతులు అంతరించే పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తల అధ్యయనాలు చెబుతున్నాయి.

కనిపించని సంక్షోభం..
1994 వరకూ 'అడవిలో అంతరించిపోయిన' జీవ, వృక్షజాతులను 'రెడ్‌లిస్ట్ ఆఫ్ బెంచ్‌మార్క్'లో చేర్చకపోయినప్పటికీ, ఇది వాటికీ వర్తించవచ్చు. ఎందుకంటే ఈ దశకు చేరుకున్న వాటిలో 12 జాతులను పునరుద్ధరించి, అడవుల్లోకి ప్రవేశపెట్టినట్లు రెండు అధ్యయనాలకు సంబంధించిన పత్రాలు 'సైన్స్ అండ్ డైవర్సిటీ జర్నల్స్'లో ప్రచురితమయ్యాయి. 65 మిలియన్ సంవత్సరాల క్రితం పెద్ద గ్రహశకలం ఒకటి భూమిపైకి దూసుకొచ్చి, డైనోసార్‌లను తుడిచిపెట్టింది. అప్పటి నుండి.. జీవజాతుల ఉనికిలో కనిపించని సంక్షోభం కొనసాగుతూ వస్తోందనేది వాస్తవం.
అయితే 'ఇప్పటికీ అంతరించిపోయిన జాతులను పునరుద్ధరించే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. మేము ఆ చర్యలు తీసుకోవాలి' అని 15 మంది శాస్త్రవేత్తలతో కూడిన అంతర్జాతీయ బృందం తెలిపింది. భూమిపై 252 మిలియన్ ఏళ్ల క్రితం 95 శాతం జీవరాశులు కనుమరుగయ్యాయి. దానిని 'గ్రేట్ డైయింగ్' అని అభివర్ణించారు శాస్త్రవేత్తలు. జీవ జాతులు ఎంత వేగంగా అంతరించిపోతే.. అంతే వేగంగా పర్యావరణ వ్యవస్థ కూడా పతనం చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అయితే 'గత కాలంతో పోలిస్తే మరింత వేగంగా జీవ, వృక్ష జాతులను కోల్పోతున్నాం' అని చైనా యూనివర్శిటీ ఆఫ్ జియోసైన్సెస్ పరిశోధకుడు యుయాంగెంగ్ హువాంగ్ చెబుతున్నారు. 'జీవవైవిధ్య నష్టాన్ని అరికట్టకపోతే పర్యావరణ వ్యవస్థకు మరింత ముప్పు వాటిల్లుతోంది' అని వివరించారు.
కాగా యూరోపియన్ బైసన్‌ల సంఖ్య 1920 నాటికి భారీగా తగ్గిపోయింది. వాటి నమూనాలను జంతుప్రదర్శనశాలలకు తరలించారు. వాటి సంతానోత్పత్తిని పెంపొందించే చర్యలను పోలాండ్‌లో ప్రారంభించారు.
నికరాగ్వాన్ తెగకు చెందిన మహిళలు కాకిల్స్ (నత్తలు) కోసం మడ అడవుల్లో వెతికే క్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలుగా పేరొందిన చెలోనోయిడిస్ హూడెన్సిస్ నమూనాను గుర్తించారు. దీని కోసం మరింత పరిశోధించగా 14 తాబేళ్లు లభ్యమయ్యాయి. వాటిని మరో ద్వీపానికి మార్చి, అక్కడ వాటి సంఖ్యను పెంచే చర్యలు చేపట్టారు. ఇవి గాలాపాగోస్‌లోని ఎస్పనోలా ద్వీపానికి చెందినవి. కాగా ఇదే ద్వీపంలో ఉండే జెయింట్ పింటా తాబేళ్లు అంతరించి పోయాయి. ఆ జాతికి చెందిన 'లోన్‌సమ్ జార్జ్' 75 కిలోల ఏకైక మగ తాబేలు 2012 వరకూ జీవించి ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా జీవవైవిధ్య పరిరక్షణ చర్యలు చేపట్టడానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. ఇందుకోసం బీడు భూములను సారవంతం చేయడం, పోషకాలను రీసైక్లింగ్ చేయడం చాలా ముఖ్యం. తద్వారా పర్యావరణాన్ని, భూమండలాన్ని కాపాడేకోగలుగుతాం.










