ప్రతి పండుగ ఒక సామాజిక బాధ్యత, జీవకోటి సఖ్యతలను దృష్టిలో పెట్టుకుని ఏర్పడినదే. మానవజాతి పరిణామంలో ఎదురైన ప్రతి విజయాన్ని సమిష్టిగా, సంతోషంగా తెలుపుకునే రోజులే పండుగలు. అలాగే వినాయక చవితీ ఎన్నో విషయాలు నేర్పుతుంది. చెట్టు, పుట్ట, నేల, నీరు, నింగి ఇవన్నీ జీవకోటికి హితాలే.. ప్రకృతిలోని భాగాలే.. ప్రకృతిని ప్రేమించడం, ఆరాధించడం అనాదిగా మన సంస్కృతిలో భాగమైంది. మనిషికి - ప్రకృతికి విడదీయరాని బంధం ఉంది. ఆ ప్రకృతికి ఆటంకం కలగకుండా మసలుకోవాల్సిన అవసరం మనమీద చాలానే ఉంది. అదెలాగో.. ఎందుకో.. అనే వివరాలతో ఈ కథనం.

వినాయకచవితి వర్షాకాలంలో వస్తుంది. నేలంతా పచ్చదనంతో కళకళలాడుతుంది. మట్టి పంటలకు అనువుగా తయారవుతుంది. ఆ మట్టి విలువ అందరికీ తెలిసేలా చేస్తుంది వినాయక చవితి. ఉరుకులు పరుగుల జీవితాలతో సతమతమయ్యే మనం సంబరాలనూ ఆడంబరాలతో మేళవించాం. పర్యావరణ పరిరక్షణ అనేదే మర్చిపోయాం. కొంతకాలంగా పర్యావరణవేత్తలు, కొన్ని సంస్థలు ప్రచారం చేయడంతో ప్రజల్లో కొంత అవగాహన కలుగుతోంది. ప్లాస్టిక్ పూలకు ఎంత మెరుపు జోడించినా సహజ పూలకు సాటిరావు. కృత్రిమ రంగులు వేసి తయారుచేసిన ప్రతిమలూ అంతే. పైగా వాటి వలన జరిగే నష్టం అపారం. వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుపుతూ.. తెలుసుకొంటూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ.
ఆహారంతో ఆరోగ్యం..
ఏ పండుగయినా ఆయా కాలాల మార్పును బట్టి నిర్దేశించిందే. శనగలు, కొబ్బరి, బెల్లం, బియ్యం, చిరుధాన్యాలతో తయారుచేసిన ఆహారపదార్థాలు బలాన్నిచ్చి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలం కాబట్టి నూనె పదార్థాలైతే జీర్ణ సమస్యలుంటాయని, ఆవిరిపై ఉడికించినవి శ్రేష్టమైనవని ఈ కాలంలో పెడతారు. అలా చెప్పే ఆరోగ్యకరమైన నియమాలను మనమూ పాటిద్దాం.

హాని కారకాలు వద్దు..
అనేకరకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి తీరని నష్టం. ఆడంబరం లేని సంబరాలే అందరికీ మంచిది. ఇప్పటికే ప్రకృతి వికృత రూపం దాల్చుతోంది. పర్యావరణం దెబ్బతిన్న కారణంగానే ధృవ ప్రాంతాల్లోని మంచు కరిగి, సముద్ర మట్టాలు పెరిగి అనేక దేశాలు మునిగిపోతున్నాయి. వాతావరణ కాలుష్యంతో జీవరాశి మనుగడకే విపత్తు ఏర్పడుతోంది. మనవంతుగా భవిష్యత్తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఎంతో ఉంది. దానిలో భాగంగానే ఆవగింజంత బాధ్యతతో మట్టిప్రతిమలనే వాడటం.. అందరూ వాడేలా చేయటం మన కర్తవ్యం.
కలసి మెలసి మెలగాలన్నదే..
అప్పట్లో వేళ్లూనుకున్న మతవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, కుల వైషమ్యాలను రూపుమాపి, ప్రజల్లో ఐక్యతను కలిగించాలనే భావనతో రూపొందిన పండుగ ఇది. అలా ఈ సంబరాల సందడి మొదలైంది. నేడు అదే పరిస్థితులు మనచుట్టూ విషవలయంలా ఆవరించి ఉన్నాయి. వాటిని పటాపంచలు చేసి, భవిష్యత్తరాన్ని కాపాడాల్సింది మనమే. గణపతిలో గణం అంటే సమూహం. ఆదిమ సమాజంలో గుంపులుగా జీవించే వారు. అందరినీ ఐక్యంగా ఉంచేందుకు ఒక నాయకుడు ఉండేవాడు. అతను ఆ గణానికి అధిపతి. గణాల మధ్య విభేదాలు రాకుండా మనుగడ సాగించేలా చేసే వారిని గణపతిగావ్యవహరించేవారు.

పత్రిలో పలు ఔషధ గుణాలు..
పండుగకు తెచ్చే పత్రిలోనూ అర్థముంది. ఆకులు అలములే కదా అనుకోకండి. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన పరిసర ప్రాంతాల్లో దొరికేవే కాబట్టి, వాటి విలువను గుర్తించం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను అవి నయం చేస్తాయి. ఆయుర్వేద వైద్యంలో అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకూ అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రతిసారీ చెప్పటం సాధ్యం కాదు కాబట్టి ఇలా పండుగ రోజు అందరూ కలసి జరుపుకున్న వాటిద్వారా వచ్చిన అవగాహన సంవత్సరమంతా పాటించాలనేదే ఉద్దేశ్యం.
కాలుష్య రహితంగా..
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల బదులు మట్టి విగ్రహాలు పెట్టినట్లే మిగిలిన పనులూ ప్రకృతి హితంగా చేద్దాం. ఊరేగింపు సమయంలో టపాసులు కాల్చటం వలన వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. అది మన పరిసరాలకే కాక, మనకు రక్షణగా ఉన్న ఓజోన్ పొరకూ హాని కలిగిస్తుంది. డిజె శబ్దాలు విపరీత ధ్వని కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఎవరినీ ఇబ్బంది పెట్టని విధంగా, కాలుష్య రహితంగా పండుగ చేయడం పర్యావరణాన్ని కాపాడటమే.

చైతన్యం ఉద్యమమై..
పండుగని ప్రకృతి సమేతంగా.. ఆనందంగా జరుపుకుందాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి కృషి చేస్తున్నాయి. మనమూ వారితో చేయి కలుపుదాం. ఐక్యతా భావం పెంపొందాలనే ఉద్దేశ్యంతో మొదలైన పండుగను పర్యావరణ దిశగా ఒక ఉద్యమంలా చేయాల్సిన తరుణం ఆసన్నమైంది.
వివిధ సంస్థల ప్రోత్సాహం..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక సంస్థలు, వివిధ సంఘాలు మట్టివిగ్రహాలు తయారుచేసి, అమ్ముతున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. 'వోకల్ ఫర్ లోకల్, గ్రీన్ ఛాలెంజ్' పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కొంతమంది ఉపాధ్యాయుల ప్రోత్సాహం, సహకారంతో విద్యార్థులూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వలన కలిగే హానిని తెలుపుతూ మట్టి విగ్రహాలనే ఉపయోగించాల్సిందిగా ప్రచారం చేస్తున్నారు. కనిగిరిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ సైన్సు అధ్యాపకులు షేక్ ఖాజా హుస్సేన్ మాస్టర్ విద్యార్థులతో కలిసి అచ్చులతో మట్టి విగ్రహాలు తయారుచేసి, ఐదు సంవత్సరాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఇలాంటి అవగాహనా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువద్దాం.

ప్రభుత్వ నిబంధనలు..
పండుగ ఆరంభం నుంచి నిమజ్జనం రోజు వరకు ఎవరికీ అసౌకర్యం కలగకూడదని ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది.
- పందిళ్లు వేసేటప్పుడు, విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ఐదు, అంతకంటే ఎక్కువమంది కమిటీగా ఏర్పడి, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌లో పర్మిషన్ తీసుకోవాలి. రాత్రి వేళల్లో కమిటీ ప్రతినిధులు కాపలా ఉండాలి.
- ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తీసుకోవాలి.
- విగ్రహాన్ని ఏర్పాటు చేసేటప్పుడు, ఆ స్థల యజమాని, పంచాయితీ, గ్రామ అధికారుల అనుమతి తీసుకోవాలి.
- విగ్రహంగానీ, బ్యానర్లు, ఫ్లెక్సీలుగానీ, ప్రయాణికులకు, వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా ఏర్పాటు చేయాలి.
- పందిళ్ల వద్ద వాడే స్పీకర్ల శబ్ద పరిమితి విషయంలోనూ, సమయ పాలన (ఉ. 6 గం.- రాత్రి 10 గం. వరకు) విషయంలోనూ నింబంధనలు పాటించాలి.
- నిమజ్జన సమయంలో ట్రాఫిక్‌కు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. కేటాయించిన ప్రదేశం, మార్గాలలోనే నిమజ్జనానికి ఏర్పాట్లు చేసుకోవాలి.

సృజనాత్మక నిమజ్జనం..
గ్రామాల్లో జలాశయాలలో నిమజ్జనం చేసే వీలుండవచ్చు. కానీ పట్టణాల్లో అలాంటి అవకాశం లేనప్పుడు హ్యాపీగా కుండీల్లోనే నిమజ్జనం చేసుకుంటే సరి. ఇటీవల అనేక సృజనాత్మక నిమజ్జనాలు వెలుగులోకి వస్తున్నాయి. విగ్రహాలు తయారుచేసేటప్పుడే వాటిలో రకరకాల విత్తనాలు ఉంచుతున్నారు. నిమజ్జనం తర్వాత అవి మొలకెత్తడం ఎంత ఆనందంగా ఉంటుందో కదా! అలాగే మీరే ఒక మట్టికుండీలో నిమజ్జనం చేసి, ఆ మట్టిలోనూ పిల్లలతో వారి పేర్ల మొదటి అక్షరమో, చిన్న పేరైతే పూర్తిగానో రాయించడం, ఇండియా లాంటి వారికిష్టమైన ఆకారాలను విత్తనాలతో రాయించి, నాటించవచ్చు. వారికీ మొక్కల పెంపకంపై ఆసక్తి కలుగుతుంది. ఇలా ఆలోచించేలా చేయాలే కానీ ఆ చిట్టి మెదళ్ళలో ఎన్ని గట్టి ఉపాయాలో వెలికి వస్తాయి. మరి మనమూ పర్యావరణ హితానికి నడుం కడదాం..!










