ప్రజాశక్తి - తెనాలి (గుంటూరు జిల్లా) :వీణ అవార్డ్స్ నాటకోత్సవాలు రెండోరోజూ అలరించాయి. విజయవాడకు చెందిన వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పద్య నాటకం, సాంఘిక నాటిక పోటీలు శనివారంతో రెండో రోజుకి చేరాయి. పద్య నాటక ప్రదర్శనలో భాగంగా 'మహారధి కర్ణ' నాటకాన్ని ఉదయం ప్రదర్శించారు. రేణిగుంటకు చెందిన వినాయక నాటక కళామండలి ప్రదర్శించిన నాటకానికి వెంకటగిరి వీరమల్లయ్య భాగవతుల రచన కాగా, జానకిరామ్ దర్శకత్వం వహించారు. తర్వాత పాలకొల్లుకు చెందిన కళాధరి నటథామం వారి 'కారే రాజులు? రాజ్యముల్ కలుగవే' పౌరాణిక పద్య నాటకాన్ని ప్రదర్శించారు. పిఎస్‌ఆర్ ఆంజనేయులు రచనకు ఎంఎస్ కె ప్రభు దర్శకత్వం వహించారు. సాంఘిక నాటిక ప్రదర్శనలలో భాగంగా సాయంత్రం ఎంవిఎస్ హరనాధరావు రచనకు, జి విజయబాబు దర్శకత్వం వహించిన తేటగుంటకు చెందిన భాస్కరరాజు కళాపీఠం వారు 'క్షీరసాగర మధనం' నాటికను ప్రదర్శించారు. వెలగలేరు ఆర్ట్స్ థియేటర్ వారి 'రాత' సాంఘిక నాటిక ప్రదర్శన జరిగింది.










