Apr 18,2023 16:25

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు / పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న పిఆర్‌ సి, 4 డిఎల ఎరియర్స్‌ చెల్లించాలని కోరుతూ ఎపి అమరావతి జేఏసీ కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. కృష్ణా జిల్లా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ టి.సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తమ డిమాండ్ల సాధన కోసం మలిదశ ఉద్యమ కార్యాచరణకులో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వివిధ రూపాల్లో తమ నిరసనను తెలియజేస్తున్నామన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్ల రిబ్బన్‌లు ధరించి విధులకు హాజరు అవడం, అనంతరం ఒక రోజు సెల్‌ డౌన్‌ కార్యక్రమం చేపట్టి నిరసనను విజయవంతం చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉదృతం చేస్తామన్నారు. సిపిఎస్‌ ఉద్యోగ సంఘ నాయకులు పి.సత్యనారాయణ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం బొప్పరాజు వెంకటేశ్వర్లు ముందుకు రావడం సంతోషదాయకం అన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా ఎంతటి ఉద్యమానికైనా ఎటువంటి నిరసనలు అయిన చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎపిఆర్‌ఎస్‌ఏ జిల్లా సెక్రటరీ ఎంవి. శ్యామ్‌నాధ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్‌ పరిష్కారించే వరకు నిరసనలు ఆపే ప్రసక్తే లేదన్నారు. కలెక్టరేట్‌ ప్రెసిడెంట్‌ పామర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రద్దు చేస్తానన్న సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ జిల్లా ఏపీ జేఏసీ సెక్రటరీ వై.విరావ్‌, కోశాధికారి విజయ కుమార్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు, యాకూబ్‌, కృష్ణమూర్తి, బేగ్‌, సెక్రటరీ కార్యవర్గ సభ్యులతో పాటు , వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం ఈ ధర్నాకు సంఘీ భావం తెలిపారు.