May 28,2023 08:02

వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను పలకరిస్తున్న యువ కథానాయకుడు సంతోష్‌ శోభన్‌. ఇక తీసినవి తక్కువే అయినా మంచి సినిమాలు తీసిన దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు నందిని రెడ్డి. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా 'అన్నీ మంచి శకునములే'. ట్రైలర్‌తో కాస్తంత ఫీల్‌ గుడ్‌ ఫీలొచ్చింది. మాళవిక నాయర్‌ కథానాయిక. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది? కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలే మున్నాయి.. తెలుసుకుందాం..!
కథలోకి వెళ్తే.. విక్టోరియాపురం అనే ఊరిలో ఉన్న కె.జి.కాఫీ ఎస్టేట్‌కు.. అక్కడ తయారయ్యే కాఫీ పొడికి ఓ ప్రత్యేకమైన ఖ్యాతి ఉంది. అయితే ఎస్టేట్‌ విషయమై ప్రసాద్‌ (రాజేంద్రప్రసాద్‌), దివాకర్‌ (రావు రమేష్‌) కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఓ కోర్టు కేసు నడుస్తుంటుంది. ఈ విషయంలో రాజీ పడమని న్యాయమూర్తులు నచ్చజెప్పినా వెనక్కి తగ్గరు. దీంతో కేసు డైలీ సీరియల్‌లా కొనసాగుతూనే ఉంటుంది. దివాకర్‌ తమ్ముడు సుధాకర్‌ (నరేష్‌) కొడుకు రిషి (సంతోష్‌ శోభన్‌).. ప్రసాద్‌ కూతురు ఆర్య (మాళవిక నాయర్‌) ఒకేరోజు ఒకే ఆస్పత్రిలో జన్మిస్తారు. కానీ, తాగిన మత్తులో డాక్టర్‌ చేసిన తప్పు కారణంగా ఆ పిల్లలు మారిపోతారు. ఆర్య సుధాకర్‌ ఇంట్లో పెరిగితే...రిషిని ప్రసాద్‌ పెంచి పెద్దచేస్తాడు. అయితే గొడవలతో సంబంధం లేకుండా ఆర్యను రిషి ప్రేమిస్తుంటాడు. కానీ ఆ విషయాన్ని మనసులోనే దాచుకుంటాడు. కానీ ఆర్య వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ తర్వాత ఏమైంది? రిషి తనను ప్రేమిస్తున్న విషయం ఆర్యకు తెలిసిందా? కోర్టు గొడవల్ని సెటిల్‌ చేసే క్రమంలో రిషి పడ్డ ఇబ్బందులేంటి? పిల్లలు మారిన విషయం తల్లిదండ్రులకు ఎలా తెలిసింది? అన్నదే మిగతా కథ.

2


కె.జి.కాఫీ ఎస్టేట్‌, దాని ప్రత్యేకతను పరిచయం చేస్తూ సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించారు దర్శకురాలు నందినిరెడ్డి. ఇక దివాకర్‌, ప్రసాద్‌ కుటుంబాల మధ్య సాగుతున్న కోర్టు కేసును ఆద్యంతం ఆహ్లాదభరితంగా పరిచయం చేస్తూ కథకు కీలకమైన మరో మలుపును చూపించారు. నిజానికి కొన్ని పతాక సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకు ముందే తెలుస్తుంటాయి. కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా.. మరికొన్ని సాగతీతగా అనిపిస్తాయి. రిషి-ఆర్యల మధ్య ఇగో క్లాష్‌తో ప్రథమార్ధం ముగుస్తుంది. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్‌ విషయానికొస్తే.. మరీ టీవీ సీరియల్‌లాగే అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు చాలా భావోద్వేగ భరితంగా సాగుతాయి. ముఖ్యంగా పిల్లల పుట్టుక వెనకున్న రహస్యం తెలిశాక ఆ తల్లిదండ్రులు పడే వేదనను మనసులకు హత్తుకునేలా చూపించారు నందిని రెడ్డి.
నటుడిగా సంతోష్‌ శోభన్‌ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. భావోద్వేగమైన నటనతో మనసుల్ని బరువెక్కిస్తాడు. మాళవికకు ఇది అలవాటైన పాత్రే. అభినయం, నటనతో ఆకట్టుకున్నారు. రావు రమేష్‌, రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, గౌతమి, షావుకారు జానకీ.. ఇలా ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు నటించారు. వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, మహేష్‌ నవ్వించే ప్రయత్నం చేశారు. హింస, అసభ్యత కనిపించకపోవడం కలిసొచ్చే అంశాలు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం ఆహ్లాదకరంగా అనిపించింది. నేపథ్య సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. సన్నీ కూరపాటి, రిచర్డ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రహణం బాగుంది.

టైటిల్‌ : అన్నీ మంచి శకునములే
నటీనటులు : సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌, రాజేంద్రప్రసాద్‌,
రావు రమేష్‌, నరేష్‌, గౌతమి, షావుకారు జానకి, ఊర్వశి,
వెన్నెల కిషోర్‌ తదితరులు
సంగీతం : మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి,
రిచర్డ్‌ ప్రసాద్‌
ఎడిటింగ్‌ : జునైద్‌ సిద్ధిఖీ
నిర్మాత : ప్రియాంక దత్‌
స్క్రీన్‌ప్లే : షేక్‌ దావూద్‌
దర్శకత్వం : బి.వి. నందినిరెడ్డి