Jul 24,2023 09:53
  • ఫైనల్లో భారత్‌పై ఘన విజయం

కొలంబో : ఆసియా పురుషుల ఎమర్జింగ్‌ కప్‌ను పాకిస్తాన్‌ కైవసం చేసుకుంది. ఆదివారం కొలంబోలో జరిగిన ఫైనల్లో భారత్‌పై పాకిస్తాన్‌ 128 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్తాన్‌ విధించిన 353 పరుగుల లక్ష్య చేధనలో భారత్‌ ఘోరంగా విఫలం చెందింది. 40 ఓవర్లలో కేవలం 224 పరుగులకే ఆలౌటయింది. భారత జట్టులో అభిషేక్‌ శర్మ 61 పరుగులు, యాశ్‌ ధూల్‌ 39 పరుగులు, సాయి సుదర్శన్‌ 29 పరుగులు చేసినా.. మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో భారత్‌కు లక్ష్య చేధనలో ఓటమి తప్పలేదు.

223


         ఆదివారం తుదిపోరులో ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌్‌కు దిగిన పాకిస్థాన్‌లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఓపెనర్లు అర్థ సెంచరీలతో కదం తొక్కారు. సైం అయూబ్‌ 59 పరుగులు చేయగా, సాహిబ్జాద ఫర్హాన్‌ 65 పరుగులు చేశారు. తరువాత వచ్చిన ఓమైర్‌ యూసఫ్‌ 35 పరుగులు చేయగా, ఇక ఈ తరువాత తయ్యబ్‌ తాహర్‌ సెంచరీతో కదం తొక్కాడు. 71 బంతులు ఎదుర్కొన్న తాహీర్‌ 12 ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌గా తాహీర్‌ నిలవగా, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను భారత్‌కు చెందిన నిశాంత్‌ సింధూ గెలుచుకున్నాడు.