Nov 05,2023 17:25

- ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి
- ఆహ్వాన సంఘం ఏర్పాటు
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్‌ :కర్నూలులో డిసెంబర్‌ 15, 16, 17 తేదీల్లో జరగనున్న అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ సమావేశాలను జయప్రదం చేసేందుకు ఆహ్వాన సంఘం ఏర్పాటైంది. కర్నూలు జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని ఎంపిపి సమావేశ మందిరంలో అఖిల భారత కిసాన్‌సభ ఆహ్వాన సంఘ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా టిడిపి మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్యాలకుర్తి తిక్కారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, కోశాధికారిగా జి.రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా ఎంఎ.గపూర్‌, అర్జా రామకృష్ణ, మరో వంద మందితో కమిటీని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర ఉద్యమం తరువాత అంతటి చరిత్రను సృష్టించిన ఢిల్లీ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎఐకెఎస్‌ (అఖిలభారత కిసాన్‌సభ) జాతీయ సమావేశాలను కర్నూలులో నిర్వహించడం రైతు ఉద్యమానికే కాకుండా.. కరువు ప్రాంతంగా ఉన్న కర్నూలుకు కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిధులు రాక, నీళ్లను ఆపుకోలేక కర్నూలు జిల్లా ఎడారిగా మారిందన్నారు. కరువు కారణంగా ఊళ్లకు ఊళ్లు వలస బాట పట్టాయని తెలిపారు. దేశంలో కార్పొరేట్‌ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.60 లక్షల కోట్లను ఉదాసీనంగా మాఫీ చేసిందన్నారు. దేశం ఆకలిని తీర్చే రైతుల రుణాలను రద్దు చేయమంటే దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని మోడీ ప్రభుత్వం అడ్డగోలు సమాధానాలు చెబుతోందని విమర్శించారు. జాతీయ సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగ సమస్యలను చర్చించడంతోపాటు, జిల్లా రైతుల దుస్థితిని దేశవ్యాప్తంగా ఎండగట్టడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.
తిక్కారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా కరువు పరిస్థితులకు పాలకులే కారణమని అన్నారు. పులికనుమ, వేదవతి, గుండ్రేవుల వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఎంతో మేలు జరిగి ఉండేదని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు ముందుగానే ధర ప్రకటించి అమ్ముతున్నారని, ఆరుగాలం కష్టపడి పండించే రైతు ఉత్పతులకు మాత్రం సాగుకు ముందుగా ధరలు నిర్ణయించడం లేదన్నారు. దీంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి వనరులు లేక కర్నూలు పశ్చిమ ప్రాంతం ఎడారిగా మారుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.