న్యూఢిల్లీ : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఇజిఐ)కి చెందిన సీనియర్ జర్నలిస్టులను మణిపూర్ పోలీసులు అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. ఈ మేరకు బుధవారం తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఇజిఐ తరపున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు అత్యవసరంగా ఈ అంశాన్ని మౌఖిక ప్రస్తావన తెచ్చారు. ఈ నెల 2న నివేదిక విడుదలైన తరువాత మణిపూర్ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తమకు తెలిసిందని పేర్కొన్నారు. ఆగస్టు 7 నుంచి 10వ తేదీ మధ్య ఇజిఐ ప్రెసిడెంట్ సీమా ముస్తఫా, సంజరుకపూర్, సీమ గుహ, భరత్‌భూషణ్‌లతో కూడిన నిజ నిర్ధారణ బృందం మణిపూర్‌లో విస్తృతంగా పర్యటించిందని తెలిపారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షులతో ఇంటర్వ్యూలు చేసి నివేదిక తయారు చేసిందని దివాన్ తెలిపారు. ఇజిఐ ఉద్రేకాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందంటూ మణిపూర్ సిఎం బీరేన్‌సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో నివేదికను ఇచ్చినందుకు వారిపై కేసులు నమోదు చేసిన మణిపూర్ పోలీసులు అరెస్టు చేయాలని భావించారని న్యాయవాది దివాన్ తెలిపారు. సవివరమైన విచారణ కోసం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని మణిపూర్ పోలీసులను ఆదేశించింది. మణిపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవమని, తప్పుడు ప్రకటనలని ఎడిటర్స్ గిల్డ్ ఇండియా విమర్శించింది.
మీడియా స్వేచ్ఛకు సామూహిక రక్షణ అవసరం : జి-20 దేశాల సంపాదకులు, జర్నలిస్టులు
ఈ నెల 9, 10 తేదీల్లో జి-20 వార్షిక సదస్సు జరుగుతున్న నేపథ్యంలో జి-20 దేశాలకు చెందిన సంపాదకులు, జర్నలిస్టులు బుధవారం ఇక్కడ ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆయా దేశాల్లో, ప్రాంతాల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వేధింపులు, అణచివేత చర్యలపై వారు చర్చించారు. జి 20 సభ్య దేశాల్లో మీడియా స్వేచ్ఛకు గల ప్రాముఖ్యతను సమావేశం నొక్కి చెప్పింది. రాబోయే రెండు రోజుల్లో నేతలు తమ చర్చల్లో కూడా ఈ అంశాలను చర్చించాలని సమావేశం కోరింది. మీడియా స్వేచ్ఛను పరిరక్షించుకోవడమనేది ఇప్పుడు చాలా కీలకమని సమావేశం అభిప్రాయపడింది. జి-20 దేశాల్లో, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మీడియా స్వేచ్ఛకు సామూహిక రక్షణ అవసరమని పేర్కొంది. భారత ప్రభుత్వ అణచివేత విధానాల కారణంగా ఈ సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సి వచ్చింది.










