Nov 09,2023 09:37
  • ప్రభుత్వం ఉత్తర్వులు
  • ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జిల్లా విద్యాశాఖ అధికారుల (డిఇఒ) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. డిఇఒ కార్యాలయంలో ఉన్న అడిషనల్‌ డైరెక్టర్లకు డిఇఒలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ బుధవారం జిఓ 282ను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల పట్ల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఇచ్చిన 505, 4 జిఓలకు విరుద్ధంగా ఈ ఉత్తర్వులు ఉన్నాయని చెబుతున్నాయి. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌కు సంబంధించిన 73 జిఓకు అనుగుణంగా డిఇఒ, డిప్యూటీ డిఇఒల నియామకం చేపట్టాలని కోరుతున్నాయి. అకడమిక్‌ అనుభవం లేని వారితో డిఇఒ పోస్టులు భర్తీ చేయడం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జిఓ 282ను తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు యుటిఎఫ్‌ అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇచ్చిన 73 జిఓ ఆధారంగా వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు. కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రక్రియను ప్రభుత్వమే ఆటంకపరచడం ఉపాధ్యాయుల ప్రమోషన్‌ ఛానల్‌కు తూట్లు పడటం సరికాదని పేర్కొన్నారు. 282 జిఓను రద్దు చేయకపోతే ఇతర ఉపాధ్యాయ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసంబద్ధమైన జిఓ 282ను రద్దు చేయాలని ఎపిటిఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్‌ చిరంజీవి మరో ప్రకటనలో కోరారు.