ఫైనల్లో వెస్ట్‌జోన్‌పై 75పరుగుల తేడాతో గెలుపు
14వ సారి టైటిల్ కైవసం
బెంగళూరు: దులీప్ ట్రోఫీ టైటిల్‌ను సౌత్‌జోన్ జట్టు చేజిక్కించుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో వెస్ట్‌జోన్‌పై 75 పరుగుల తేడాతో గెలిచింది. సౌత్‌జోన్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోర్ 5వికెట్ల నష్టానికి 182పరుగులతో ఆదివారం చివరిరోజు ఆటను కొనసాగించిన వెస్ట్‌జోన్ జట్టు చివరిరోజు 222 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ప్రియాంక్ పంచల్(95) పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో మూడు పరుగులు జతచేసి ఔటయ్యాడు. అయితే.. అతిత్ షేత్, ధర్మేంద్ర జడేజా చివర్లో పోరాడినా ప్రయోజనం లేకపోయింది. జడేజా భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కాడు. దాంతో, ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. వి. కౌశిక్, సాయికిషోర్‌కు నాలుగేసి వికెట్లు దక్కాయి. దాంతో, గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జట్టు చేతిలో ఓటమికి బదులు తీర్చుకున్నట్లయ్యింది. దీంతో సౌత్‌జోన్‌జట్టు ట్రోఫీ నెగ్గడం ఇది పద్నాలుగో సారి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ విద్వత్ కవిరప్పకు లభించాయి.










