- 20 లక్షల ఎకరాల్లో సాగు లేదు
- తీవ్ర వర్షాభావం, డ్రైస్పెల్స్ కోరల్లో మూడొంతుల రాష్ట్రం
- 14 జిల్లాలు.. 416 మండలాల్లో తక్కువ వర్షం
- కంటింజెన్సీపై ప్రభుత్వం మీనమేషాలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్ సాగుపై కరువు దెబ్బ పడింది. ఆగస్టు నెలాఖరికి కూడా లక్షలాది ఎకరాలు విత్తనం పడక బీడుపడ్డాయి. ఇప్పటికి కావాల్సిన సాధారణ సాగులో ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వర్షాల్లేక భూములు నెర్రెలిచ్చుతున్నాయి. మూడొంతుల రాష్ట్రం తీవ్ర వర్షాభావం కోరల్లో చిక్కుకుంది. సగానికిపైగా మండలాలు డ్రైస్పెల్ (వర్షానికి వర్షానికి మధ్య అంతరం)లో మగ్గుతున్నాయి. చాలా చోట్ల చినుకు జాడ లేక నెల రోజులు దాటిపోయింది. ఆగస్టు చివరాఖరుకు పడాల్సిన సాధారణ వర్షంలో 25 శాతం తక్కువ పడింది. 14 జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 679 మండలాలుండగా 416 మండలాల్లో (62 శాతం) తక్కువ వర్షం కురిసింది. మరీ 42 మండలాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఖరీఫ్ పంటల సేద్యానికి అదను తప్పింది. నీటి వసతి గ్యారంటీ ఉన్న కాల్వల కింద తప్ప ఇతర ప్రాంతాల్లో సాగు నిలిచిపోయింది. మెట్ట సేద్యానికి కరువు పరిస్థితులు ఆటంకంగా తయారయ్యాయి. వేసిన పంటలు వర్షాభావం, డ్రైస్పెల్స్ వలన వాడిపోతుండగా, మిగతా 2లో కొత్తగా సాగు చేయడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలించట్లేదు. సుదీర్ఘకాలం వానలు పడకపోవడంతో వేసిన పంటలు బెట్టకొచ్చి తెగుళ్లు వ్యాపించి నష్టం చేస్తున్నాయి. దాంతో అనంతపురం, ఇతర రాయలసీమ, మెట్ట ప్రాంతాల్లో వేసిన పంటలను రైతులు ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. గుంటూరు, ఎన్‌టిఆర్, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, వంటి చోట్ల వేసిన పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటిని పోస్తున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటుతుండటంతో ఆయట్టు రైతుల్లో ఆందోళన ఎక్కువైంది.
ప్రత్యామ్నాయ పంటలే దిక్కు
సీజన్‌లో మూడు నెలలు గడిచిపోయాయి. ఇంకా మిగిలింది సెప్టెంబర్ ఒక్క నెలే. ఇప్పటికి దాదాపు మెట్ట సేద్యం పూర్తి కావాలి. పత్తితో సహా అన్ని పంటల సాగులోనూ తగ్గుదల నమోదైంది. వేరుశనగ సాగు బాగా తగ్గింది. సీజన్ నార్మల్ సాగు విస్తీర్ణం 86 లక్షల ఎకరాలు కాగా ఇప్పటికి 51.27 లక్షల ఎకరాల్లో (60 శాతం) పంటలు వేశారు. కాగా ఆగస్టు నెలాఖరుకు 71.17 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉంది. తగ్గుదల 19.9 లక్షల ఎకరాలు. 28 శాతం విస్తీర్ణంలో సాగు లేదు. నిరుడు ఇదే సమయానికి 71.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. గతేడాది కంటే 17 లక్షల ఎకరాల్లో ఈ తడవ సాగు తగ్గింది. వరి 3.78 లక్షల ఎకరాలు (22 శాతం), తృణధాన్యాలు 47 వేల ఎకరాలు (13 శాతం), పప్పుధాన్యాలు 2.30 లక్షల ఎకరాలు (41 శాతం), మొత్తం ఆహార ధాన్యాలు 6.55 లక్షల ఎకరాలు (17 శాతం), వేరుశనగ 8.05 లక్షల ఎకరాలు (53 శాతం), మొత్తం నూనెగింజలు 8.02 లక్షల ఎకరాలు (49 శాతం), పత్తి 4.40 లక్షల ఎకరాలు (32 శాతం) తగ్గాయి. కంటింజెన్సీ ప్రణాళికలపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది.
ఏడు జిల్లాల్లో 50 శాతం లోపు
ఏడు జిల్లాల్లో 50 శాతం లోపు సాగు నమోదైంది. అత్యల్పంగా ప్రకాశంలో 20 శాతం పంటలు వేశారు. అన్నమయ్య 28 శాతం, వైఎస్‌ఆర్ 29 శాతం, పల్నాడు 30 శాతం, శ్రీసత్యసాయి 35 శాతం, చిత్తూరు 37 శాతం, బాపట్ల 39 శాతం సేద్యం జరిగింది. అత్యధికంగా నెల్లూరులో 91 శాతం, కోనసీమ, పశ్చిమగోదావరిలో 90 శాతం వంతున పంటలు సాగయ్యాయి.
దత్తలూరులో అత్యల్పం
జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర సాధారణ సగటు వర్షపాతం 419.6 మిల్లీమీటర్లు కాగా 314.6 మిమీ పడింది. నార్మల్‌లో 25 శాతం మైనస్. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్‌టిఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంత పురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, తిరుపతి... 14 జిల్లాలు తక్కువ వర్షం కేటగిరిలో ఉన్నాయి. తతిమ్మా 12 జిల్లాల్లో నార్మల్ వర్షం పడింది. ఒక్క కృష్ణాలో తప్ప అన్ని జిల్లాల్లోనూ వర్షాభావ మండలాలున్నాయి. నెల్లూరు జిల్లా దత్తలూరులో రాష్ట్రంలోకెల్ల అత్యల్పంగా 83 శాతం తక్కువ వర్షం పడింది. ఆ తర్వాత అదే జిల్లా వింజమూరులో 81 శాతం మైనస్ వర్షం నమోదైంది.












