- బిక్కుబిక్కుమంటూ జీవనం
- గోదావరికి కొనసాగుతున్న వరద
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నాలుగు రోజులుగా డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంకలు వరద నీటిలో నానుతున్నాయి. ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజీ నుంచి 18 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదలడంతో వైనతేయ, వశిష్ట, వృద్ధ గౌతమి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో తొమ్మిది మండల్లాలోని 30 గ్రామాలపై వరద ప్రభావం తీవ్రంగా పడింది. 24 ఆవాసాల్లోని 749 కుటుంబాలకు చెందిన 1,321 మంది వరద ప్రభావానికి నిరాశ్రయులయ్యారు. జిల్లా వ్యాప్తంగా 3,592 ఎకరాల్లో వరి పంట, 135 ఎకరాల్లో వరి నారుమళ్లు, 945 ఎకరాల్లో ఉద్యాన పంటలు నీట మునిగాయి. ఆయా లంక గ్రామాల్లో నివసించే వేలాది కుటుంబాలు ప్రతి రోజూ పట్టణ కేంద్రాల్లో కూలి పనులు, వివిధ వృత్తులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ప్రస్తుతం గ్రామాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెనలు నిర్మించడం ద్వారా కొంత ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. దశాబ్దాల కాలంగా వీటి నిర్మాణ హామీ కాగితాలకే పరిమితమైంది. దీంతో, ఏటా ముంపు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జలదిగ్బంధంలో లంక గ్రామాలు
పి.గన్నవరం మండలంలో బూరుగులంక, అరిగెలవారి పాలెం, గంటి పెదపూడి లంక, కనకాయలంక, జొన్నలంక, కె.ఏనుగుపల్లి, ఏనుగుపల్లి లంక, కండాలపాలెం, నాగుల్లంక, శివాయలంక, కాట్రగడ్డ, కె.ముంజవరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లి, పెదపట్నం, పెదపట్నం లంక, దొడ్డవరం, పాశర్లపూడి, పాశర్లపూడి బాడవ గ్రామాలు, అప్పనపల్లి కాజ్‌వేపైకి వరద పోటెత్తింది. దీంతో, అప్పనపల్లిలో బాలబాలాజీ దేవాలయంలో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, ఎదురుబిడెం కాజ్‌వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

నదీ గర్భంలో కలిసిపోతున్నాయి
వాకలగరువులో కరకట్ట దిగువన ఫిషర్మెన్ పేటలో సుమారు వంద కుటుంబాలకుపైగా జీవిస్తున్నాం. ఏటా వరదల సమయంలో ఒడ్డు కోతకు పలు ఇళ్లునదీ గర్భంలో కలిసిపోతున్నాయి. రివిట్మెంట్, గ్రోయిన్లు నిర్మించాలని ఏళ్ల తరబడి వేడుకుంటున్నా పట్టించుకొనే నాథుడు లేడు. పది రోజులుగా వేటలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం.
- అంకాని రామకృష్ణ, మత్స్యకారుడు, వాకలగరువు అంబాజీపేట మండలం

ఇసుక తవ్వకాలతో పెరిగిన ముప్పు
మా గ్రామంలో 500 కుటుంబాలు ఉన్నాయి. గ్రామం చుట్టూ నీరు చేరడంతో పడవపైనే రాకపోకలు సాగిస్తున్నాం. మరో అడుగు నీటిమట్టం పెరిగిందంటే గ్రామం మునిగిపోకతప్పదు. గట్టుకు చెంతనే ఇసుకను ఇష్టానుసారంగా తవ్వేయడంతో కాలిబాట కనుమరుగైంది. దీంతో, నడుంలోతు నీళ్లలో నడిచి వెళ్లి ఆ గట్టున నావ ఎక్కాల్సి వస్తోంది. గ్రామస్తులందరమూ చందాలు వేసుకుని బోటు కొనుగోలు చేసి రాకపోకలు సాగిస్తున్నాం.
- టి.భూలక్ష్మి, అనగార్లంక, భీమవరం జిల్లా

కాజ్‌వే ఎత్తుగా ఉంటే అవస్థలు ఉండవు
మూడు లంక గ్రామాలకు ఆర్ అండ్ బి రహదారిలో పాశర్లపూడిలో కరకట్ట దిగువ కాజ్‌వే ఎత్తు చేస్తే వరదల సమయంలో రాకపోకలకు అంతరాయం ఉండదు. 600 మీటర్ల మేర కాజ్‌వే వద్ద ఐదడుగుల ఎత్తులో బ్రిడ్జి నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. మెటీరియల్‌ను సైతం గతేడాది తరలించారు. పనులు మాత్రం నేటికీ ప్రారంభించలేదు. ఎత్తు పెంచితే 3వ ప్రమాద హెచ్చరిక స్థాయి వరద వచ్చినా రాకపోకలకు వెసులుబాటు ఉంటుంది.
- కంకిపాటి హేమంతరావు, అప్పనపల్లి బాడవ

ఉపాధి కరువు
ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరద నీరు వస్తే లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. రాకపోకలు నిలిచిపోతుండడం తో ఉపాధికి దూరమవు తున్నాం. ఏటా ఇదే పరిస్థితి. వరద ఉంటే ఆ రోజు పస్తులే అన్నట్టుగా మా పరిస్థితి తయారైంది.
- బద్దే సతీష్, పెదపట్నంలంక గ్రామం

శిథిలావస్థలో స్లూయిజ్‌లు
కరకట్ట ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడిన సమయంలో మురుగు నీటిని నదిలో మళ్లించేందుకు బ్రిటిష్ వారి హయాంలో అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు నిర్మించారు. నేటికీ వీటినే వాడుతున్నారు. ప్రస్తుతం ఇవి శిథిలావస్థకు చేరుకున్నాయి. వరదల సమయంలో లీకుల ద్వారా వరద పోటెత్తి పంటలకు నష్టం వాటిల్లుతోంది.కాలనీలను ముంచెత్తుతోంది. ఈ దృష్ట్యా స్లూయిజ్‌లను పటిష్ట పర్చాలి.
- కోలా వెంకటరాజు, మత్స్యకారుడు, వాకలగరువు అంబాజీపేట మండలం










